ఇలాగే వదిలేస్తే మహిళలను అవమానించడం ఆనవాయితీ అయిపోతుంది.. ఆర్జీవీపై చర్యలు తీసుకోండి: జగన్‌కు వీహెచ్ లేఖ

  • నాగార్జున యూనివర్సిటీలో వర్మ వివాదాస్పద వ్యాఖ్యలు
  • వర్మ వ్యాఖ్యలపై సినీ పరిశ్రమ స్పందించకపోవడం బాధాకరమని వ్యాఖ్య
  • దమ్ముంటే కేయూకు కానీ, ఓయూకు కానీ వచ్చి అలాంటి వ్యాఖ్యలు చేయాలని సవాల్
ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ ఇటీవల నాగార్జున యూనివర్సిటీలో మహిళలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఇప్పటికే పలువురు ప్రముఖులు, మహిళా సంఘాలు ఆర్జీవీపై విరుచుకుపడ్డాయి. చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశాయి. తాజాగా, తెలంగాణ పీసీసీ మాజీ అధ్యక్షుడు వి.హనుమంతరావు ఈ జాబితాలో చేరారు. 

రాంగోపాల్ వర్మపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి లేఖ రాశారు. నాగార్జున యూనివర్సిటీలో మహిళలను ఉద్దేశించి వర్మ చేసిన వ్యాఖ్యలు సరికావన్నారు. సినీ పరిశ్రమ కూడా ఇప్పటి వరకు ఆయన వ్యాఖ్యలపై స్పందించకపోవడం బాధాకరమన్నారు. ఇలానే వదిలస్తే మహిళలను అవమానించడం ఆనవాయితీగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. 

వర్మకు నిజంగా దమ్ముంటే కాకతీయ యూనివర్సిటీ లేదంటే ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి ఇలాంటి వ్యాఖ్యలు చేయాలని వీహెచ్ సవాలు విసిరారు. నాగార్జున వర్సిటీ వైస్ చాన్సలర్‌ను సస్పెండ్ చేసి వర్మపై చర్యలు తీసుకోవాలని, లేదంటే పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని వీహెచ్ హెచ్చరించారు.


More Telugu News