వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుపుకు ఇదే నాంది: గంటా శ్రీనివాసరావు

  • జగన్ పాలన కూల్చివేతలతో ప్రారంభమయిందన్న గంటా
  • వైసీపీ వాళ్లు వెండి నాణేలు పంచినా ఫలితం దక్కలేదని వ్యాఖ్య
  • రాష్ట్ర ప్రభుత్వంపై వ్యతిరేకత స్పష్టంగా కనిపించిందన్న గంటా
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించింది. ఈ సందర్భంగా టీడీపీ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ జగన్ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పట్టభద్రుల ఎన్నికల్లో గెలుపొందిన వారికి అభినందనలు తెలిపారు. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కూల్చివేతలతో పాలన ప్రారంభమయిందని విమర్శించారు. డెవలప్ మోడ్ లో కాకుండా, డిస్ట్రక్షన్ మోడ్ లో పాలన కొనసాగుతోందని అన్నారు. గతంలో జరిగిన ఎన్నికల్లో ఓటర్లను ఏదో విధంగా మేనేజ్ చేస్తూ గెలుస్తూ వచ్చారని... ఇప్పుడు 6 నెలల ముందే ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించినప్పటికీ... వైసీపీ గెలవలేకపోయిందని చెప్పారు. 

ఉత్తరాంధ్రలో మంత్రులు, వైసీపీ ముఖ్య నేతలు వైసీపీ అభ్యర్థి గెలుపు కోసం ఎంతో కష్టపడ్డారని... వెండి నాణేలు, డబ్బులు పంచారని, అవకతవకలకు పాల్పడ్డారని చెప్పారు. ఎప్పుడు వచ్చామన్నది ముఖ్యం కాదని, బుల్లెట్ దిగిందా, లేదా అనేది ముఖ్యమని... టీడీపీ అభ్యర్థి చిరంజీవి ఆలస్యంగా వచ్చినా ఘన విజయం సాధించారని అన్నారు. వైసీపీ వాళ్లు దొంగ ఓట్లు కూడా నమోదు చేయించినప్పటికీ ఫలితం దక్కలేదని చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వంపై వ్యతిరేకత స్పష్టంగా కనిపించిందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుపుకు ఈ ఎన్నికలే నాంది అని చెప్పారు.


More Telugu News