ఫేస్ బుక్, ఇన్ స్టా ‘బ్లూటిక్’ సేల్.. అమెరికాలో ప్రారంభించిన ‘మెటా’.. ధర ఇదే!

  • తొలుత పెయిడ్ బ్లూటిక్ లను ప్రారంభించిన ట్విట్టర్
  • ఇప్పుడు ఎఫ్ బీ, ఇన్ స్టా ఖాతాలకు బ్లూటిక్ ఉండాలంటే డబ్బు చెల్లించాల్సిందే
  • అమెరికాలో రెండు రకాల చార్జీలు వసూలు చేస్తున్న మెటా
ట్విట్టర్ తర్వాత ‘మెటా’ కూడా ‘బ్లూ టిక్’ అమ్మకాలను ప్రారంభించింది. ఇకపై ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్ లలో తమ ఖాతాలకు బ్లూటిక్ ఉండాలని కోరుకునే వాళ్లు కొంత మొత్తం చెల్లించాల్సిందే. అయితే ప్రస్తుతానికి మన దేశంలో ఇది మొదలు కాలేదు. అమెరికాలో మాత్రమే ఈ సర్వీసును అందుబాటులోకి తెచ్చింది.

వెబ్ సైట్ ద్వారా లాగిన్ అయ్యి ‘బ్లూటిక్’ సర్వీసు పొందే వారి నుంచి నెలకు 11.99 డాలర్ల (రూ.989)ను మెటా వసూలు చేస్తోంది. అదే మొబైల్ యాప్ స్టోర్ ద్వారా తీసుకునే వారి నుంచి 14.99 డాలర్లు (రూ.1,237) చార్జ్ చేస్తోంది. అయితే వెబ్ ద్వారా సైన్ అప్ అయ్యే వారికి.. కేవలం ఫేస్ బుక్ బ్లూటిక్ అందుతుంది. అదే మొబైల్ యాప్ స్టోర్ ద్వారా కొనుగోలు చేసే వారికి ఫేస్ బుక్ తోపాటు ఇన్ స్టా బ్లూటిక్ ఆప్షన్ కూడా ఉంటుంది. 

బ్లూటిక్.. వెరిఫికేషన్ బ్యాడ్జ్ లాంటిది. పబ్లిక్ ఫిగర్, సెలబ్రిటీ లేదా బ్రాండ్‌కు చెందిన ఖాతాగా ధ్రువీకరిస్తుంది. బ్లూటిక్ కొనాలంటే 18 ఏళ్లు నిండి ఉండాలి. ఫొటో ఐడీని సమర్పించాలి. వెరిఫికేషన్ ప్రాసెస్ తర్వాతే పేరు పక్కన బ్లూటిక్ కనిపిస్తుంది. ఒకసారి మెటా వెరిఫై చేసిన తర్వాత.. ప్రొఫైల్ పేరు లేదా డిస్ ప్లే పేరు లేదా ప్రొఫైల్‌లోని ఏదైనా ఇతర సమాచారాన్ని మార్చడం అంత ఈజీ కాదు. మళ్లీ వెరిఫికేషన్ ప్రక్రియ ద్వారా మార్చుకోవాల్సి ఉంటుంది.


More Telugu News