పేపర్ లీకేజీ ఘటన: ఆత్మహత్య చేసుకున్న యువకుడి తల్లిదండ్రులకు కేటీఆర్ ఫోన్

  • ఉద్యోగ ప్రయత్నాల్లో విసిగిపోయి సిరిసిల్ల యువకుడి బలవన్మరణం
  • బాధిత తల్లిదండ్రులను ఫోన్ లో పరామర్శించిన కేటీఆర్
  • అండగా ఉంటామని, అధైర్యపడొద్దని భరోసా
టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీ ఘటన నేపథ్యంలో మనస్తాపానికి గురై సిరిసిల్లకు చెందిన యువకుడు నవీన్‌ కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఉద్యోగ ప్రయత్నాల్లో విసిగిపోయి తనువుచాలించాడు. ఈ ఘటనపై మంత్రి కేటీఆర్ స్పందించారు. నవీన్ తండ్రి నాగభూషణంతో ఆయన ఫోన్ లో మాట్లాడారు.

అండగా ఉంటామని, అధైర్యపడొద్దని నవీన్ కుమార్ తల్లిదండ్రులకు కేటీఆర్ భరోసానిచ్చారు. అర్ధాంతరంగా తనువు చాలించడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. నవీన్ అంత్యక్రియలకు దగ్గరుండి ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

సిరిసిల్ల జిల్లాలోని బీవైనగర్ కు చెందిన చిటికెన నాగభూషణం, సుశీల దంపతులకు ముగ్గురు కుమారులు. వారిలో నవీన్ కుమార్ చిన్నవాడు. సాఫ్ట్ వేర్‌ ఇంజనీర్‌ ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తూనే.. ప్రభుత్వ ఉద్యోగం కోసం గ్రూప్స్‌కు ప్రిపేర్ అవుతున్నాడు. ఈ క్రమంలో టీఎస్ పీఎస్పీ పేపర్ లీకేజీ వ్యవహారంతో ఆవేదనకు గురై బలవన్మరణానికి పాల్పడ్డాడు.


More Telugu News