పిల్లల్లో గోళ్లు కొరికే అలవాటును మాన్పించండిలా..!

  • వేప నూనె, కాకరకాయ రసంతో గోళ్లు కొరికే అలవాటుకు స్వస్తి
  • చేతి వేళ్లకు వెల్లుల్లి రసం పూస్తే మరోమారు నోట్లో వేలు పెట్టరు
  • ఏదో ఒక పనిలో బిజీగా ఉంచితే పిల్లల్లో గోళ్లు కొరకాలనే ఆలోచన రాదంటున్న నిపుణులు
పిల్లల్లో గోళ్లు కొరికే అలవాటు సాధారణమే.. అయితే, దీనివల్ల అనారోగ్యం బారినపడే ప్రమాదం ఎక్కువ. ఈ అలవాటును తప్పించడం ఓ ప్రహసనంగా తల్లులు భావిస్తుంటారు. అయితే, ఈ చెడు అలవాటును సులభంగా మాన్పించవచ్చని నిపుణులు చెబుతున్నారు. బాల్యంలో మొదలయ్యే ఈ అలవాటును కొంతమంది పెద్దయ్యాక కూడా వదిలించుకోలేరు. పిల్లల్లో ఈ అలవాటును మాన్పించేందుకు ఈ చిట్కాలు పాటించి చూడండి. వేపనూనె, వెల్లుల్లి, కాకరకాయ వంటి వాటితో పిల్లలు గోళ్లుకొరకడం మానేసేలా చేయొచ్చని నిపుణులు అంటున్నారు. పిల్లలతో పాటు పెద్దలు కూడా ఈ చిట్కాలతో గోళ్లు కొరికే అలవాటును మానుకోవచ్చని చెప్పారు.

  • గోళ్లకు వేపనూనె రాయడం వల్ల పిల్లలు గోళ్లు కొరికేందుకు ప్రయత్నించినపుడు నోటికి చేదు తగులుతుంది. దీంతో వెంటనే నోట్లో నుంచి చేతిని తీసేస్తారు. కొన్ని రోజులు ఇలా చేస్తే మీ పిల్లలను గోళ్లు కొరికే అలవాటు నుంచి తప్పించవచ్చు. చెడు బ్యాక్టీరియాను నాశనం చేసే గుణముండడం వల్ల వేప నూనె మీ పిల్లలను అంటువ్యాధుల నుంచి కాపాడుతుంది.
  • వంటింట్లోని వెల్లుల్లితో కూడా ఈ గోళ్లు కొరికే అలవాటును మాన్పించవచ్చు. వెల్లుల్లి ముక్కను వేలి గోళ్లకు రుద్దితే ఆ వాసన, వెల్లుల్లి రుచి కారణంగా గోళ్లు కొరికేందుకు ప్రయత్నించరు. వెల్లుల్లి నూనెతోనూ ప్రయోజనం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
  • కాకరకాయను పేస్ట్ లా చేసి దాని రసాన్ని పిల్లల గోళ్లకు పూయాలి. అది ఎండిపోయేదాకా చూసి ఆ తర్వాత వదిలేస్తే.. నోట్లో వేలు పెట్టుకున్నపుడు చేదు తగలడం వల్ల మరోసారి నోట్లో వేలు పెట్టుకునే ప్రయత్నం చేయరు.
  • గోళ్లను ఎప్పటికప్పుడు కత్తిరించడం మంచి అలవాటు. దీనివల్ల చేతుల్లో క్రిములు చేరేందుకు అవకాశం ఉండదు. దీనివల్ల పిల్లలను గోళ్లు కొరికే అలవాటు నుంచి దూరంగా ఉంచొచ్చు.
  • పిల్లల చేతులకు గ్లౌజులు తొడగడం కూడా ఫలితాన్నిస్తుంది.
  • ఏదో ఒక పని చెబుతూ పిల్లలను బిజీగా ఉంచడం వల్ల వారి మనసును గోళ్లు కొరికే అలవాటు నుంచి మళ్లించవచ్చు. కొన్ని రోజుల పాటు ఇలా చేయడం ద్వారా పిల్లల్లో గోళ్లు కొరికే అలవాటును మాన్పించవచ్చు.


More Telugu News