హెచ్3ఎన్2 వైరస్ ముప్పు ఎవరిలో ఎక్కువంటే..!

  • స్వైన్ ఫ్లూతో పోలిస్తే హెచ్3ఎన్2 బాధితుల్లో తీవ్ర లక్షణాలు
  • హెచ్3ఎన్2 బాధితుల్లో వేర్వేరు లక్షణాలు కనిపిస్తున్నట్లు నిపుణుల వెల్లడి
  • కరోనా తరహాలో ఆర్టీపీసీఆర్ టెస్టుతో నిర్ధారణ చేయొచ్చని వివరణ
కరోనా మహమ్మారి తర్వాత ఇటీవల హెచ్3ఎన్2 వైరస్ దేశమంతటా వ్యాపిస్తోంది. జలుబు, జ్వరం సహా స్వైన్ ఫ్లూ లక్షణాలతో ఆసుపత్రులను ఆశ్రయిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. దీంతో ప్రజల్లో భయాందోళనలు పెరుగుతున్నాయి. స్వైన్ ఫ్లూ, హెచ్3ఎన్2, కరోనాల మధ్య తేడా తెలియక జనం భయపడుతున్నారు. అయితే, హెచ్3ఎన్2 సీజనల్ ఇన్ ఫ్లూయెంజా అని, భయపడాల్సిన అవసరంలేదని వైద్య నిపుణులు చెబుతున్నారు. తగిన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని ధైర్యం చెబుతున్నారు. బహిరంగ ప్రదేశాలు, రద్దీ ప్రాంతాల్లో మాస్క్ ధరించడంతో పాటు చేతులను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలని సూచిస్తున్నారు.

హెచ్3ఎన్2 లక్షణాలు..
హెచ్3ఎన్2 ఇన్ ఫ్లూయెంజా లక్షణాలు ఒక్కొక్కరిలో ఒకలా ఉండొచ్చని నిపుణులు తెలిపారు. తీవ్రమైన జ్వరం, తలనొప్పి, బాడీ పెయిన్స్, గొంతు నొప్పి, తీవ్రమైన, నిరంతర దగ్గు, జలుబు, ఊపిరితిత్తులలో ఇబ్బంది తదితర లక్షణాలు ఈ వైరస్ బాధితులలో కనిపిస్తాయన్నారు. కొందరిలో ఒళ్లు నొప్పులు, వికారం, వాంతులు లేదా అతిసారం లక్షణాలు కూడా కనిపిస్తున్నాయని చెప్పారు. ఊపిరి పీల్చుకోవడం కష్టంగా అనిపించినా, బీపీ పడిపోయినా, పెదవులు నీలి రంగులోకి మారడం, మూర్ఛ వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాలని చెప్పారు.

పిల్లలు, వృద్ధుల్లోనే ఎక్కువ..
ఐదేళ్లలోపు పిల్లలు, 65 ఏళ్లు పైబడిన వృద్ధులు, గర్భిణులు, ఆస్తమా, మధుమేహం, గుండె జబ్బులు, నరాల వ్యాధులకు చికిత్స తీసుకుంటున్న వారు హెచ్3ఎన్2 వైరస్ బారిన పడే ప్రమాదం ఎక్కువ.

ఇది స్వైన్ ఫ్లూ కంటే తీవ్రమైనది..
హెచ్3ఎన్2 ఇన్‌ఫెక్షన్ తీవ్రత స్వైన్ ఫ్లూ కంటే ఎక్కువగా ఉంటుందని నిపుణులు తెలిపారు. మైయాల్జియా, జ్వరం, తలనొప్పి, గొంతు నొప్పి వంటి ఇతర లక్షణాలు ఈ రెండింట్లో ఒకేలా కనిపిస్తాయని అన్నారు. వైద్య పరీక్షల ద్వారా తేడా తెలుసుకోవచ్చని, కరోనా నిర్ధారణ తరహాలో ఆర్టీపీసీఆర్ టెస్టు ద్వారా వైరస్ నిర్ధారణ చేయవచ్చని చెప్పారు.


More Telugu News