ఇజ్రాయెల్‌లో బయటపడ్డ మరో కరోనా వేరియంట్

  • బీఏ2, బీఏ1 వేరియంట్ల జన్యు కలయికతో కొత్త వేరియంట్
  • కొత్త వేరియంట్ కారణంగా రెండు కేసులు
  • ప్రకటించిన ఇజ్రాయెల్ ఆరోగ్య శాఖ
ఇజ్రాయెల్‌లో మరో కొత్త కరోనా వేరియంట్ వెలుగులోకి వచ్చింది. కరోనా బారిన పడ్డ ఇద్దరు పేషెంట్లలో ఈ కొత్త వేరియంట్ ను గుర్తించినట్టు ఆ దేశ ఆరోగ్య శాఖ తాజాగా పేర్కొంది. బీఏ2 (ఒమిక్రాన్), బీఏ1 వేరియంట్ల జన్యువుల కలయికతో ఈ కొత్త వేరియంట్ ఉనికిలోకి వచ్చినట్టు పేర్కొంది. బెన్ గురియన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగిన ఇద్దరు ప్రయాణికుల్లో కోవిడ్ లక్షణాలు కనిపించడంతో ఆర్‌టీపీసీఆర్ పరీక్ష నిర్వహించారు. ఈ క్రమంలోనే కొత్త వేరియంట్ విషయం వెలుగులోకి వచ్చింది. ఇద్దరు ప్రయాణికులకు జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పులు తదితర సమస్యలు ఉన్నాయని ఆరోగ్య శాఖ వెల్లడించింది.  

రెండు వేర్వేలు వేరియంట్ల జన్యువుల కలయికతో కొత్త వేరియంట్ పుట్టుకురావడం సాధారణ పరిణామమేనని ఇజ్రాయెల్ కోవిడ్ టాస్క్ ఫోర్స్ చీఫ్ ప్రాఫెసర్ సల్మాన్ జర్కా పేర్కొన్నారు. ఒకే కణంలో రెండు రకాల (వేరియంట్) వైరస్‌లు ప్రవేశించిన సందర్భాల్లో ఇలా జరుగుతుందన్నారు. ఇజ్రాయెల్‌లో ప్రస్తుతం ఒమిక్రాన్ కేసులు తగ్గుతున్నప్పటికీ బీఏ1 వేరియంట్ కేసులు పెరుగుతుండటంతో ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. ప్రజలు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, మూడు సార్లు కొవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవాలని ఆ దేశ ప్రధాని సూచించారు.


More Telugu News