జెర్సీ మార్చిన సన్​ రైజర్స్.. ఐపీఎల్ లో రాత మారేనా!

  • కొత్త జెర్సీని ఆవిష్కరించిన ఫ్రాంచైజీ
  • ఈసారి కెప్టెన్ గా ఐడెన్ మార్ క్రమ్
  • ఈ నెల 31 నుంచి ఐపీఎల్ 2023
ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌-2023 (ఐపీఎల్) సీజన్‌ లో సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ కొత్త కెప్టెన్ తో పాటు కొత్త జెర్సీతో బరిలోకి దిగనుంది. నయా సీజన్‌కు సంబంధించి జెర్సీని సన్ రైజర్స్ గురువారం ఆవిష్కరించింది. మయాంక్‌ అగర్వాల్‌, ఉమ్రాన్ మాలిక్, వాషింగ్టన్ సుందర్‌ కొత్త జెర్సీతో ఉన్న వీడియోను ట్విట్టర్‌ లో షేర్ చేసింది. ఆరెంజ్ కలర్ జెర్సీలో పెద్దగా మార్పులు చేయలేదు. సౌతాఫ్రికా20 లీగ్‌లో టైటిల్ నెగ్గిన సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ జెర్సీని పోలినట్టుగా భుజాలు, చేతులపై నల్ల రంగు ఉంచింది. ఈ సీజన్ లో సన్ రైజర్స్ కు దక్షిణాఫ్రికాకు చెందిన ఐడెన్ మార్ క్రమ్ కెప్టెన్ గా వ్యవహరిస్తాడు.

సౌతాఫ్రికా టీ20 లీగ్ లో సన్ రైజర్స్ ఈస్టర్న్ జట్టుకు అతనే ట్రోఫీ అందించాడు. కాగా, ఈ నెల 31న మొదలయ్యే ఐపీఎల్ కొత్త సీజన్‌ లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తన తొలి మ్యాచ్‌ ను ఏప్రిల్‌ 2న హైదరాబాద్‌ వేదికగా రాజస్థాన్‌తో తలపడనున్నది. కాగా, కొన్నేళ్లుగా సన్ రైజర్స్ ఏ మాత్రం ఆకట్టుకోవడం లేదు. గత సీజన్‌లో కేవలం ఆరు విజయాలతో పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో నిలిచింది. ఈసారి కొత్త కెప్టెన్, కొత్త జెర్సీలో బరిలోకి దిగుతున్న నేపథ్యంలో రైజర్స్ రాత మారుతుందని అభిమానులు ఆశిస్తున్నారు.


More Telugu News