సిసోడియాపై మరో అవినీతి కేసు.. నమోదు చేసిన సీబీఐ!

  • ఢిల్లీ ఫీడ్ బ్యాక్ యూనిట్ కేసులో సిసోడియాపై సీబీఐ ఎఫ్ఐఆర్
  • ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగించారంటూ అభియోగాలు
  • ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న సిసోడియా
లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయిన ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం, ఆప్ నేత మనీశ్ సిసోడియా.. ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నారు. ఈ కుంభకోణం విషయంలో ఆయనపై ఈడీ, సీబీఐ కేసులు నమోదు చేశాయి. తాజాగా సిసోడియాపై సీబీఐ మరో కేసు నమోదు చేసింది.

ఢిల్లీ ఫీడ్ బ్యాక్ యూనిట్ (ఎఫ్ బీయూ) కేసులో మనీశ్ సిసోడియాపై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. అవినీతిని అరికట్టేందుకంటూ ఢిల్లీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫీడ్‌బ్యాక్ యూనిట్.. పొలిటికల్ ఇంటెలిజెన్స్ యూనిట్ లా పనిచేసిందని ప్రాథమిక విచారణలో గుర్తించినట్లు సీబీఐ తెలిపింది. ‘‘ఫీడ్‌బ్యాక్ యూనిట్‌ను చట్టవిరుద్ధంగా ఏర్పాటు చేయడం, దానితో అక్రమంగా పని చేయించడం వల్ల ప్రభుత్వ ఖజానాకు సుమారు రూ.36 లక్షల వరకు నష్టం వాటిల్లింది’’ అని పేర్కొంది. 

సిసోడియాను ప్రాసిక్యూట్ చేయడానికి గత ఫిబ్రవరిలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే సీబీఐ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. సిసోడియా, అప్పటి ఢిల్లీ ప్రభుత్వ విజిలెన్స్ సెక్రటరీ సుకేశ్ కుమార్ జైన్, సీఐఎస్ఎఫ్ రిటైర్డ్ డీఐజీ రాకేశ్ కుమార్ సిన్హాతోపాటు ప్రదీప్ కుమార్ పంజ్, సతీశ్ కేత్రపాల్, గోపాల్ మోహన్ పైనా కేసు నమోదు చేసింది.


More Telugu News