ఈ నెల 19న విద్యా దీవెన నిధులు: ఏపీ ప్రభుత్వం

  • పేద విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ నిధుల విడుదల
  • విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నిధులు జమ చేయనున్న సర్కారు 
  • ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో సీఎం జగన్ సభ
నిరుపేద విద్యార్థులు ఉన్నత చదువులు చదివేందుకు ఉద్దేశించిన జగనన్న విద్యా దీవెన పథకం నిధుల విడుదలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. ఈ నెల 19న నిధులు విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో జరిగే సభలో ముఖ్యమంత్రి జగన్ బటన్ నొక్కి ఈ నిధులను విద్యార్థుల ఖాతాలో జమ చేస్తారని వెల్లడించింది. 

తిరువూరులో ఈ నెల 18న ముఖ్యమంత్రి జగన్ సభ జరగాల్సి ఉంది. అయితే, సభావేదికకు పక్కనే ఉన్న సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో ఇంటర్ ఎగ్జామ్ జరుగుతుండడంతో ముఖ్యమంత్రి జగన్ తన కార్యక్రమాన్ని 19కి వాయిదా వేసుకున్నారు. ఈ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రంలో శనివారం ఇంటర్ విద్యార్థులు ఇంగ్లిష్ పరీక్ష రాయనున్నారు. దీంతో సభ వల్ల విద్యార్థులకు అసౌకర్యం కలుగుతుందనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి సభను వాయిదా వేసుకున్నారని అధికార వర్గాలు తెలిపాయి.

జగనన్న విద్యా దీవెన స్కీమ్ కింద అర్హులైన పేద విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం పూర్తిస్థాయి ఫీజు రీయింబర్స్ మెంట్ అందిస్తోంది. ఇంజనీరింగ్, మెడిసిన్‌, డిగ్రీ ఇతర కోర్సులు చేసేవారికి రూ.20 వేలు అందజేస్తోంది. ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్‌ విద్యార్థులకు రూ.15 వేలు అందజేస్తోంది. కళాశాలలకు కట్టాల్సిన ఫీజులను మూడు నెలలకు ఒకసారి విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేస్తోంది.


More Telugu News