ఆర్సీబీ గెలిచిందోచ్.. వారియర్స్‌పై 5 వికెట్ల తేడాతో విజయం!

  • ఐదు మ్యాచ్‌ల తర్వాత తొలి విజయం
  • యూపీని 135 పరుగులకే కట్టడి చేసిన బెంగళూరు
  • మరో రెండు ఓవర్లు మిగిలి ఉండగానే ఐదు వికెట్లు కోల్పోయి ఛేదన
హమ్మయ్య! రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) గెలిచింది. ఐదు వరుస పరాజయాలకు చెక్‌ పెడుతూ ఎట్టకేలకు ఓ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. మహిళల ప్రీమియర్ లీగ్‌ (డబ్ల్యూపీఎల్)లో భాగంగా గత రాత్రి యూపీ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో విజయం సాధించి బోణీ కొట్టింది. తొలుత ప్రత్యర్థిని 135 పరుగులకే పరిమితం చేసిన బెంగళూరు అమ్మాయిలు.. ఆ తర్వాత మరో రెండు ఓవర్లు మిగిలి ఉండగానే 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకున్నారు. ఈ లీగ్‌లో బెంగళూరుకు ఇదే తొలి గెలుపు. 46 పరుగులతో జట్టు విజయానికి బాటలు వేసిన కనిక అహుజాకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. కెప్టెన్ స్మృతి మంధాన(0) మరోమారు దారుణంగా విఫలమైంది. హెదర్ నైట్ 24, రిచా ఘోష్ 46 పరుగులు చేశారు. 

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన యూపీ 19.3 ఓవర్లలో 135 పరుగులకు ఆలౌట్ అయింది. గ్రేస్ హారిస్ 46 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా, కిరణ్ నవగిరే, దీప్తి శర్మ చెరో 22 పరుగులు చేశారు. బెంగళూరు బౌలర్లలో ఎల్లిస్ పెర్రీ 3 వికెట్లు పడగొట్టింది. డివైన్, ఆశా శోభన తలా రెండు వికెట్లు తీసుకున్నారు. ఇప్పటి వరకు ఆరు మ్యాచ్‌లు ఆడిన బెంగళూరుకు ఇది తొలి విజయం. 10 పాయింట్లతో ముంబై అగ్రస్థానంలో ఉండగా ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా ఢిల్లీ కేపిటల్స్ (8), యూపీ వారియర్స్ (4), ఆర్సీబీ (2), గుజరాత్ జెయింట్స్ (2) ఉన్నాయి. నేటి రాత్రి ఢిల్లీ కేపిటల్స్-గుజరాత్ జెయింట్స్ తలపడనున్నాయి.


More Telugu News