స్టే ఇవ్వని సుప్రీం.. రేపు ఈడీ విచారణకు కవిత!

  • ఈడీ నోటీసులపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఎమ్మెల్సీ కవిత
  • మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించిన ధర్మాసనం
  • ఈ పిటిషన్ పై ఈనెల 24న విచారణ జరుపుతామని వెల్లడి
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో విచారణకు హాజరవ్వాలని ఈడీ ఇచ్చిన నోటీసులపై స్టే ఇచ్చేందుకు అత్యున్నత ధర్మాసనం నిరాకరించింది. ఈ పిటిషన్ పై ఈనెల 24న విచారణ జరుపుతామని స్పష్టం చేసింది. దీంతో రేపు జరగనున్న ఈడీ విచారణకు కవిత హాజరు కావాల్సిన పరిస్థితి వుంది. 

లిక్కర్ స్కామ్ కేసు విచారణలో భాగంగా ఈనెల 11న ఈడీ అధికారులు కవితను 8 గంటలకు పైగా విచారించిన విషయం తెలిసిందే. 16న మరోసారి విచారణకు హాజరుకావాలని అధికారులు నోటీసులిచ్చారు. ఈ నేపథ్యంలో ఈడీ ఇచ్చిన నోటీసులపై స్టే ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టును కవిత ఆశ్రయించారు. 

ఇతరులతో కలిపి విచారిస్తామని తనకు ఇచ్చిన నోటీసులో ఈడీ అధికారులు పేర్కొన్నారని, కానీ వాస్తవానికి అలా విచారణ చేపట్టలేదని పిటిషన్ లో పేర్కొన్నారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండానే తన ఫోన్ సీజ్ చేశారని ఆరోపించారు. సీఆర్ పీసీ 160 సెక్షన్ ప్రకారం మహిళను తన ఇంట్లోనే విచారించాలని, కానీ ఈడీ కార్యాలయానికి పిలిచారని అభ్యంతరం తెలిపారు. అయితే ఈ పిటిషన్ పై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు సుప్రీం నిరాకరించింది. 24న విచారణ జరుపుతామని చెప్పింది.


More Telugu News