ఒకరి మీద కక్షతో కాదు..నిజం అందరికీ తెలియాలనే నా పోరాటం: వైఎస్ సునీతా రెడ్డి

  • తన తండ్రి హత్య కేసులో దర్యాప్తు సంస్థలను ఎవ్వరూ ప్రభావితం చేయొద్దన్న సునీత 
  • నిజం బయటికి వస్తే భవిష్యత్తులో మరెవరికీ ఇలాంటిది జరగదని వ్యాఖ్య 
  • నేడు వివేకా నాలుగో వర్ధంతి సందర్భంగా సమాధి వద్ద నివాళులు 
తన తండ్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో దర్యాప్తు సంస్థలను ఎవ్వరూ ప్రభావితం చేయవద్దని డాక్టర్ వైఎస్ సునీతా రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ రోజు వైఎస్ వివేకానంద రెడ్డి నాలుగో వర్ధంతి సందర్భంగా తండ్రి సమాధి వద్ద ఆమె నివాళి అర్పించారు. ఈ సందర్భంగా సునీతారెడ్డి మీడియాతో మాట్లాడారు. 

‘మా నాన్న చనిపోయి ఈ రోజుకి నాలుగు సంవత్సరాలు అవుతోంది. మాకు న్యాయం జరిగేందుకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. నాన్న చనిపోయిన మొదట్లో కడప, కర్నూలులో ఇలాంటి సంఘటనలు ఇది మామూలే కదమ్మా.. ఎందుకు ఇలా ఆందోళన చెందుతున్నారని నాతో కొందరు అన్నారు. కానీ, అది తప్పు అని నిరూపించేందుకే నేను ప్రయత్నం చేస్తున్నా. ఇలాంటి పరిస్థితి మరెవరికీ జరగకూడదనే నా పోరాటం. ఇది ఒకరిమీద కక్షతో చేసేది కాదు. నిజం అందరికీ తెలియాలనే ఈ పోరాటం చేస్తున్నా. నిజం బయటికి వస్తే భవిష్యత్తులో మరెవరికీ ఇలాంటిది జరగదు. మరో కుటుంబాన్ని కాపాడిన వాళ్లం అవుతాం’ అని ఆమె అభిప్రాయపడ్డారు. 

తన తండ్రి హత్య కేసులో సొంత కుటుంబసభ్యుల మీద ఆరోపణలు చేస్తున్న విషయం తనకు తెలుసన్నారు. అయితే, కేసు విచారణ దశలో ఉన్నందున తాను దీనిపై మాట్లాడబోనన్నారు. తనకు తెలిసిన విషయాలన్నీ మొదట్లో సిట్, తర్వాత సీబీఐకి ఇచ్చానన్నారు. ‘దర్యాప్తు సంస్థలను ఎవ్వరూ ప్రభావితం చేయకూడదు. దర్యాప్తు గురించి కామెంట్ చేయకూడదు. మీకు ఎవరికైనా ఏదైనా తెలిస్తే దయచేసి దర్యాప్తు సంస్థలకు తెలపండి. పోలీసులపై ఒత్తిడి పెట్టకుండా వారి పనిని వారు చేయనీయండని నేను మొదటి నుంచి చెబుతూ వస్తున్నా’ అని సునీత పేర్కొన్నారు.


More Telugu News