ఇచ్చట ప్రభుత్వాలు అమ్మబడును, కొనబడును: మధ్యప్రదేశ్ లో అరవింద్ కేజ్రీవాల్

  • మధ్యప్రదేశ్ లో ఆప్ ఎన్నికల ప్రచారం
  • మధ్యప్రదేశ్ లో అన్ని సీట్లలో పోటీ చేస్తామన్న కేజ్రీవాల్
  • ప్రజాస్వామ్యాన్ని అంగడి సరుకులా మార్చేశారంటూ విమర్శలు
అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న మధ్యప్రదేశ్ పై ఆమ్ ఆద్మీ పార్టీ కన్నేసింది. ఢిల్లీ దాటి ఇతర రాష్ట్రాల్లోనూ పోటీ చేస్తున్న ఆప్ ఇప్పటికే పంజాబ్ లో అధికారం చేజిక్కించుకోవడం తెలిసిందే. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాల సొంత రాష్ట్రం గుజరాత్ లోనూ 5 ఎమ్మెల్యే స్థానాలు గెలిచి తన ఉనికిని చాటుకుంది. ఇప్పుడు మధ్యప్రదేశ్ లోనూ పాగా వేసేందుకు ఆప్ సన్నద్ధమవుతోంది. 

ఈ క్రమంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ మధ్యప్రదేశ్ లో ఆప్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. భోపాల్ లో కేజ్రీవాల్ మాట్లాడుతూ... మధ్యప్రదేశ్ లో మొత్తం 230 సీట్లలోనూ పోటీ చేస్తామని ప్రకటించారు. మధ్యప్రదేశ్ లో ప్రభుత్వాలు అమ్మబడును, కొనబడును అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. 

"మధ్యప్రదేశ్ లో ప్రతిసారి ఎన్నికలు పూర్తయిన తర్వాత ఓ పార్టీ తోపుడుబండి నెట్టుకుంటూ రోడ్డెక్కుతుంది. అమ్మకానికి ఎమ్మెల్యేలు అంటూ అరుచుకుంటూ రోడ్డుపై తిరుగుతుంది. ఇంకో పార్టీ రోడ్డుపై కూర్చుని ఆ ఎమ్మెల్యేలను కొనుక్కోవడానికి సిద్ధంగా ఉంటుంది. ఈ విధంగా ప్రజాస్వామ్యాన్ని అంగట్లో సరుకులా మార్చేశారు" అని విమర్శించారు. మధ్యప్రదేశ్ ప్రజలు ఇలాంటి పరిణామాలతో తీవ్ర అసహనంలో ఉన్నారని వెల్లడించారు.


More Telugu News