మూడేళ్ల తర్వాత అంతర్జాతీయ పర్యాటకులకు ద్వారాలు తెరుస్తున్న చైనా

  • కరోనా నేపథ్యంలో తీవ్ర ఆంక్షలు విధించిన చైనా
  • నిన్నమొన్నటి వరకు లాక్ డౌన్ల అమలు
  • స్తంభించిన చైనా పర్యాటక రంగం
  • దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణకు చర్యలు
  • అంతర్జాతీయ ప్రయాణికులపై ఆంక్షల తొలగింపు
  • రేపటి నుంచి అన్ని రకాల వీసాల జారీ
ప్రాణాంతక కరోనా మహమ్మారి వైరస్ వెలుగు చూశాక అత్యంత కఠినమైన ఆంక్షలు విధించిన దేశాల్లో చైనా ఒకటి. గత కొన్ని నెలల కిందటి వరకు చైనాలో లాక్ డౌన్లు అమలయ్యాయి. ఈ మూడేళ్ల కాలంలో చైనాలో టూరిజం కార్యకలాపాలు స్తంభించిపోయాయి. 

అయితే, కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో, చైనా అంతర్జాతీయ పర్యాటకులకు ద్వారాలు తెరుస్తోంది. రేపటి నుంచి అన్ని రకాల వీసాలు జారీ చేయనుంది. దేశంలోని దక్షిణ భూభాగం హైనాన్ ఐలాండ్ కు, షాంఘై నగరానికి వచ్చే విహార నౌకలకు సంబంధించి వీసా రహిత ప్రయాణాలకు అనుమతి ఉంటుందని చైనా పేర్కొంది. ఆ మేరకు సరిహద్దు ఆంక్షలు తొలగిస్తున్నట్టు వెల్లడించింది. 

2020 మార్చి 28న చైనా కొవిడ్ కారణంగా సరిహద్దులు మూసేయగా, ఆ తేదీకి ముందు జారీ చేసిన వీసాలు కూడా ప్రస్తుతం చెల్లుబాటు అవుతాయని స్పష్టం చేసింది. 

కరోనా సంక్షోభం కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవం కోసం చైనా తాజాగా చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగానే అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు ఎత్తివేస్తున్నట్టు ప్రకటించింది.


More Telugu News