పేపర్ లీక్ దుమారం: టీఎస్ పీఎస్సీ ఆఫీస్ వద్ద రణరంగం!

  • టీఎస్ పీఎస్సీ ఆఫీస్ దగ్గర విద్యార్థి సంఘాల ఆందోళనలు
  • కమిషన్ బోర్డును పీకి పడేసిన వైనం 
  • గేట్లు దూకి.. లోపలికి వెళ్లేందుకు యత్నం.. అడ్డుకున్న పోలీసులు
టీఎస్ పీఎస్సీ పేపర్ లీక్ ఘటన సంచలనం రేపుతోంది. కమిషన్ లో పని చేస్తున్న ఉద్యోగి ప్రశ్నపత్రాన్ని లీక్ చేయడం, అతడు గ్రూప్ 1 పరీక్ష కూడా రాయడం కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆఫీస్ దగ్గర విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. 

ఉద్యోగాల నోటిఫికేషన్ ఇచ్చినట్లే ఇచ్చి.. పేపర్లు లీక్ చేసి, అర్హులైన అభ్యర్థులకు అన్యాయం చేస్తున్నారంటూ బీజేపీ అనుబంధ విద్యార్థి సంఘం బీజేవైఎం, టీజేఎస్ విద్యార్థి సంఘం భగ్గుమన్నాయి. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆఫీస్ బోర్డును విద్యార్థి నేతలు పీకేశారు. గేట్లు దూకి.. ఆఫీసులోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు.

పరిస్థితి అదుపు తప్పుతుండటంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. బలవంతంగా అక్కడి నుంచి లాక్కెళ్లారు. దీంతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. విద్యార్థుల ఆందోళనలతో టీఎస్ పీఎస్సీ పరిసరాలు రణరంగాన్ని తలపించాయి.

పేపర్ లీకేజీలు ప్రగతిభవన్ డైరెక్షన్ లో జరుగుతున్నాయంటూ నేతలు ఆరోపించారు. గ్రూప్ 1, ఇతర పరీక్షల పేపర్లు కూడా లీక్ చేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తం చేశారు. పరీక్షల పేపర్లను కాపాడుకోకపోతే టీఎస్ పీఎస్సీ బోర్డు ఎందుకని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.


More Telugu News