రూ.60కి కోరినంత ఆహారం పెడతారు.. పారేస్తే మాత్రం జరిమానా.. ఇదీ ఆ రెస్టారెంట్ రూల్!

  • మధ్యప్రదేశ్‌, ఇండోర్ లోని కర్నావత్ రెస్టారెంట్ ఆఫర్
  • ఆహారాన్ని పారేసే అలవాటు మాన్పించేందుకే ఈ స్కీమ్ ప్రారంభించినట్టు వెల్లడి
  • స్థానికంగా మారుమోగిపోతున్న రెస్టారెంట్ పేరు
అన్నం పరబ్రహ్మ స్వరూపం అని అందరికీ తెలిసిందే. కానీ కొందరు మాత్రం అలవాటులో పొరపాటుగా ఆహారాన్ని పారేస్తుంటారు. ఇంట్లో ఉన్నా హోటల్లో ఉన్నా ఇదే తీరు. ఇలాంటి వారిలో మార్పు తెచ్చేందుకు ఓ రెస్టారెంట్ కస్టమర్లకు వింత ఆఫర్ ఇచ్చింది. కేవలం రూ. 60కే అడిగినంత భోజనం పెడతామంటూ బంపర్ ఆఫర్ ఇచ్చింది. అయితే.. ఎంత తిన్నా ఫరవాలేదు కానీ ఒక్క మెతుకు వదిలేసినా జరిమానా తప్పదని హెచ్చరించింది. జరిమానా కూడా ఎంతో కాదు కేవలం ఏభై రూపాయలే! ఈ విషయంలో ఎటువంటి మినహాయింపు లేదని చెబుతున్న రెస్టారెంట్.. జరిమానా నిబంధన అందరికీ స్పష్టంగా కనిపించేలా రెస్టారెంట్ గోడలపై అతికించింది. 

మధ్యప్రదేశ్‌, ఇండోర్ నగరంలోని కర్నావత్ రెస్టారెంట్ ఈ వినూత్న ఆఫర్ ప్రకటించింది. ఈ క్రమంలో రెస్టారెంట్ టాక్ ఆఫ్ ది టౌన్ అయిపోయింది. అయితే.. రూ. 60కే కావాల్సినంత తినొచ్చన్న ఆఫర్‌కు జనం ఎగబడతారని రెస్టారెంట్ యాజమాన్యం అంచనా వేసింది.  కొందరు తాము తినగలిగినదానికంటే ఎక్కువ ఆర్డర్ చేసి చివరకు ఆహారాన్ని పారేసి వెళ్లిపోతారని భయపడింది. ఈ సమస్యకు పరిష్కారంగా పుట్టుకొచ్చినదే ఈ జరిమానా ఆలోచన.

ఆహారాన్ని పారేసే అలవాటు మాన్పించే ఉద్దేశంతోనే ఇలా జరిమానాలు విధించేందుకు నిర్ణయించామని రెస్టారెంట్ ఓనర్ అర్వింద్ సింగ్ కర్నావత్ తెలిపారు. రైతులు ఎంతో కష్టపడి ధాన్యాన్ని పండిస్తారని ఆయన చెప్పుకొచ్చారు. వారి కష్టం వృథా కాకూడదని పేర్కొన్నారు. ఇక రోజుకు రెండు పూటలా తిండి తినలేని పేదలు ఎందరో ఉన్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాబట్టి.. ఆహారం ఎంతో విలువైనదన్న స్పృహ కలిగి ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు.


More Telugu News