భారీగా పెరిగిన బంగారం ధరలు!

  • అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల పవనాలు
  • అమెరికా బ్యాంకుల మూసివేత, డాలర్ విలువ పతనం
  • ఫెడరల్ రిజ్వర్ వడ్డీ రేట్ల పెంపుతో సెంటిమెంట్‌పై దెబ్బ
  • బంగారం వైపు పెట్టుబడులు మళ్లిస్తున్న మదుపర్లు 
  • పసిడికి పెరిగిన డిమాండ్, ధరలకు రెక్కలు
వివిధ అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో మదుపర్లు పసిడి వైపు మళ్లుతున్నారు. దీంతో బంగారం ధరలకు మళ్లీ రెక్కలు వచ్చాయి. మార్చి 13న ఢిల్లీ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ బంగారం ధర రూ. 57,370కి చేరింది. ఇక విదేశీ మార్కెట్లలో ఔన్స్‌ బంగారం ధర 1875 డాలర్ల వద్ద, వెండి 20.75 డాలర్ల వద్ద ట్రేడ్ అయినట్టు హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ కమోడిటీస్ సీనియర్ అధికారి సౌమిల్ గాంధీ పేర్కొన్నారు. 

నేడు హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ బంగారం ధర రూ.53,150 వద్ద కొనసాగుతోంది. ఇక 10 గ్రాముల 24 కారెట్ బంగారం ధర రూ.57,980గా ఉంది. కిలో వెండి ధర రూ. 72,000. విశాఖపట్నంలో 10 గ్రాముల 22 క్యారెట్ బంగారం ధర రూ.53,150 కాగా 24 క్యారెట్ బంగారం ధర రూ.57,980గా ఉంది. వెండి కిలో రూ.72,000గా ఉంది. 

అమెరికాలో బ్యాంకింగ్ రంగం కుదుపులకు లోనవుతుండటంతో మదుపర్ల చూపు మళ్లీ పసిడి వైపు మళ్లింది. రోజుల వ్యవధిలో సిలికాన్ వ్యాలీ బ్యాంక్, సిగ్నేచర్ బ్యాంకులు పతనమయ్యాయి. దీంతో అమెరికా బ్యాంకింగ్ రంగం తీవ్ర ఒడిదుడుకులకు లోనైంది. దీని ప్రభావం అనేక దేశాల్లో కనిపించింది. మరోవైపు.. అమెరికా డాలర్ పతనమవ్వడం, ద్రవ్యోల్బణం కట్టడికి అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు కూడా మదుపర్ల సెంటిమెంట్‌పై దెబ్బకొట్టాయి. 

ఫలితంగా బంగారానికి డిమాండ్ పెరిగి ధరలు ఐదు వారాల గరిష్ఠానికి చేరాయి. మార్కెట్‌ ఒడిదుడుకులపాలైన ప్రతిసారీ మదుపర్లు సురక్షిత పెట్టుబడి సాధనమైన బంగారంవైపు నిధులు మళ్లిస్తారని, ప్రస్తుతం బంగారం ధరల పెరుగుదలకు ఇదే కారణమని ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కమోడిటీస్ రీసెర్చ్ అధికారి నవనీత్ దమానీ తెలిపారు.




More Telugu News