పుల్వామా దాడిపై విచారణ జరపాలి.. కాంగ్రెస్ పార్టీ రాజస్థాన్ నేత డిమాండ్

  • టెర్రర్ దాడి ఎలా జరిగిందో తేల్చాలన్న కాంగ్రెస్ నేత రంధావా
  • ఎన్నికల్లో లబ్ది పొందేందుకు మోదీ ప్లాన్ చేశాడా అని ప్రశ్న
  • రంధావా వ్యాఖ్యలపై మండిపడుతున్న బీజేపీ నేతలు
  • ప్రధానిని, తద్వారా దేశ ప్రజలందరినీ అవమానించారని విమర్శ
కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజస్థాన్ నేత సుఖ్జిందర్ సింగ్ రంధావా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పుల్వామా దాడి ఘటనపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ ఘటన లోక్ సభ ఎన్నికలకు ముందు జరిగిందని, ఎన్నికల్లో లబ్ది పొందేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఈ దాడి ఘటనను ప్లాన్ చేశారా? అని ప్రశ్నించారు. సమగ్ర విచారణ జరిపి నిజాలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. దీనిపై రాజస్థాన్ లో దుమారం రేగుతోంది. అమర జవాన్లను అగౌరవ పరిచాడంటూ బీజేపీ నేతలు మండిపడుతున్నారు. ప్రధానిని అవమానించేలా మాట్లాడాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

రాజస్థాన్ లో కాంగ్రెస్ పార్టీ అంతర్గత కుమ్ములాటలతో సతమతమవుతోంది. సీఎం అశోక్ గెహ్లాట్, మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో నేతలు కూడా రెండు వర్గాలుగా విడిపోయి, పోట్లాడుకుంటున్నారు. ఈ క్రమంలో రాజస్థాన్ కాంగ్రెస్ ఇన్ చార్జి రంధావా తాజాగా మీడియాతో మాట్లాడారు. పార్టీలో అంతర్గత కొట్లాటలు మానేస్తే మనమంతా కలిసి మోదీతో ఫైట్ చేయొచ్చని అన్నారు. కలసికట్టుగా ఫైట్ చేస్తే మోదీని సాగనంపడం కష్టమేమీ కాదని వివరించారు.

మోదీని పంపించేస్తేనే హిందుస్థాన్ బతికిబట్టకడుతుందని, మరోసారి మోదీ అధికారంలోకి వస్తే హిందూస్తాన్ మిగలదని ఆరోపించారు. రంధావా ఆరోపణలపై బీజేపీ రాజస్థాన్ చీఫ్ సతీశ్ పూనియా మండిపడ్డారు. ప్రధాని పదవిలో ఉన్న వ్యక్తిని కించపరిచేలా మాట్లాడారని, రంధావా తీరు సరికాదని విమర్శించారు. ప్రధానిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ద్వారా రంధావా మొత్తం దేశాన్నే అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.


More Telugu News