నేడు జనసేన ఆవిర్భావ సభ.. పవన్ వారాహి యాత్రలో స్వల్ప మార్పు

  • నేడు జనసేన 10వ ఆవిర్భావ సభ
  • మచిలీపట్నంలో 34 ఎకరాల్లో సభా వేదిక
  • ఆటోనగర్ నుంచి వారాహిలో బయల్దేరనున్న పవన్
జనసేన పార్టీ 10వ ఆవిర్భావ సభ వేడుకలు ఈరోజు జరగనున్నాయి. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో కార్యక్రమం జరగనుంది. 34 ఎకరాల సువిశాల ప్రాంగణంలో సభాస్థలిని ఏర్పాటు చేశారు. సభకు వస్తున్న కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లను పక్కాగా చేశారు. సభా వేదిక వద్దకు జనసేనాని పవన్ కల్యాణ్ తన ప్రచార రథం వారాహిలో చేరుకోనున్నారు. 

అయితే వారాహి యాత్రను ముందు అనుకున్నట్టుగా కాకుండా, స్వల్ప మార్పులు చేశారు. షెడ్యూల్ ప్రకారం మంగళగిరిలోని పార్టీ కార్యాలయం నుంచి వారాహిలో పవన్ రావాల్సి ఉంది. అయితే, అసెంట్లీ సమావేశాలు ఈరోజు ప్రారంభం కానున్న తరుణంలో గవర్నర్, ముఖ్యమంత్రి, మంత్రులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు అసెంబ్లీకి రావాల్సి ఉంది. దీంతో వారి వాహనాలకు ఇబ్బంది కలుగుతుందని, వారాహి ప్రయాణంలో మార్పు చేసుకోవాలని జనసేనకు పోలీసులు సూచించారు.

 దీంతో, పోలీసుల సూచన మేరకు జనసేన హైకమాండ్ వారాహి యాత్రలో స్వల్ప మార్పులు చేసింది. ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు విజయవాడలోని ఆటోనగర్ ప్రాంతం నుంచి పవన్ వారాహిలో బయల్దేరనున్నారు. సభా వేదికకు శ్రీ పొట్టి శ్రీరాములు పుణ్య వేదికగా నామకరణం చేశారు.


More Telugu News