అయ్యో ఆర్సీబీ... మళ్లీ ఓటమే!

  • డబ్ల్యూపీఎల్ లో ఐదో ఓటమి చవిచూసిన బెంగళూరు
  • ఢిల్లీ చేతిలో 6 వికెట్ల తేడాతో ఓటమి
  • తొలుత 20 ఓవర్లలో 4 వికెట్లకు 150 పరుగులు చేసిన ఆర్సీబీ
  • 19.4 ఓవర్లలో ఛేదించిన ఢిల్లీ క్యాపిటల్స్
డబ్ల్యూపీఎల్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పరాజయ పరంపర కొనసాగుతోంది. తాజాగా ఐదో ఓటమిని మూటగట్టుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో 6 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 150 పరుగులు చేసింది. ప్రత్యర్థిని కట్టడి చేయడానికి ఆ స్కోరు ఎంతమాత్రం సరిపోలేదు. 

151 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ మరో రెండు బంతులు మిగిలుండగానే ఛేదించింది. ఆఖర్లో 4 బంతుల్లో 7 పరుగులు అవసరం కాగా, జెస్ జొనాస్సెన్ ఓ సిక్స్, ఫోర్ కొట్టి మ్యాచ్ ముగించింది. ఢిల్లీ జట్టు 19.4 ఓవర్లలో 4 వికెట్లకు 154 పరుగులు చేసింది. 

జొనాస్సెన్ 15 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్ తో 29 పరుగులు చేయగా, మరిజేన్ కాప్ 32 పరుగులతో అజేయంగా నిలిచింది. అలిస్ కాప్సే 38, జెమీమా రోడ్రిగ్స్ 32 పరుగులు చేశారు. అంతకుముందు కెప్టెన్ మెగ్ లానింగ్ 15 పరుగులు చేసింది. 

కాగా, వరుస పరాజయాల నేపథ్యంలో, ఆర్సీబీ సారథి స్మృతి మంధన కెప్టెన్సీ సమర్థతపై విమర్శలు వస్తున్నాయి. తాజా ఓటమితో విమర్శకులకు మరోసారి పని కల్పించినట్టయింది.


More Telugu News