అవే కాదు... మరో ప్రశ్నాపత్రం కూడా లీక్!

  • ఇటీవల టీఎస్ పీఎస్సీలో లీకేజి కలకలం
  • రెండు ప్రశ్నాపత్రాలు లీక్ చేసిన ప్రవీణ్ అనే ఉద్యోగి
  • అసిస్టెంట్ ఇంజినీర్ ప్రశ్నాపత్రం కూడా లీక్ చేసినట్టు గుర్తింపు
  • ఇప్పటివరకు 9 మంది అరెస్ట్
ఇటీవల టీఎస్ పీఎస్సీలో ప్రవీణ్ అనే ఉద్యోగి రేణుక అనే మహిళ ద్వారా రెండు ప్రశ్నాపత్రాలు లీక్ చేయడం తెలిసిందే. వెటర్నరీ అసిస్టెంట్, టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ ప్రశ్నాపత్రాలు లీక్ చేసినట్టు గుర్తించారు. 

అయితే, ఈ రెండే కాకుండా, మరో ప్రశ్నాపత్రం కూడా ప్రవీణ్ లీక్ చేసినట్టు విచారణలో వెల్లడైంది. మార్చి మొదటి వారంలో నిర్వహించిన అసిస్టెంట్ ఇంజినీర్ పరీక్ష క్వశ్చన్ పేపర్ కూడా లీకైందని పోలీసులు ధ్రువీకరించారు. ఈ నేపథ్యంలో, మార్చి 5న జరిగిన అసిస్టెంట్ ఇంజినీర్ నియామక పరీక్షను తెలంగాణ ప్రభుత్వం రద్దు చేసే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. 

ఈ లీకేజీల ప్రధాన నిందితుడు ప్రవీణ్ టీఎస్ పీఎస్సీలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ గా పనిచేస్తున్నాడు. కంప్యూటర్లలో భద్రపరిచిన క్వశ్చన్ పేపర్లను ప్రవీణ్ తన పెన్ డ్రైవ్ లోకి కాపీ చేసుకుని, వాటిని రేణుక అనే మహిళకు ఇచ్చినట్టు పోలీసులు గుర్తించారు. రేణుక ఆ క్వశ్చన్ పేపర్లను రూ.13.5 లక్షలకు ఇద్దరు అభ్యర్థులకు విక్రయించారు.

కాగా ఈ కేసులో ప్రవీణ్ తో పాటు రేణుక, ఆమె భర్తను, సోదరుడ్ని, ఔట్ సోర్సింగ్ ఉద్యోగి రాజశేఖర్ ను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో మొత్తం 9 మందిని అరెస్ట్ చేశారు.


More Telugu News