రేపు విచారణకు రాలేనంటూ.. సీబీఐకి లేఖ రాసిన వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి

  • వివేకా హత్య కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ
  • రేపు విచారణకు హాజరు కావాల్సి ఉన్న అవినాశ్
  • హైకోర్టు సూచనతో సీబీఐకి లేఖ
  • తాను పార్లమెంటు సమావేశాలకు హాజరు కావాల్సి ఉందని వెల్లడి
వివేకా హత్య కేసు దర్యాప్తు నేపథ్యంలో కడప ఎంపీ అవినాశ్ రెడ్డి సీబీఐకి లేఖ రాశారు. రేపటి సీబీఐ విచారణకు హాజరు కాలేనని తన లేఖలో పేర్కొన్నారు. పార్లమెంటు రెండో విడత సమావేశాల దృష్ట్యా, తనకు మినహాయింపు ఇవ్వాలని కోరారు. 

ఇవాళ తెలంగాణ హైకోర్టు సూచనతో అవినాశ్ రెడ్డి ఈ మేరకు సీబీఐకి లేఖ రాశారు. అవినాశ్ రెడ్డి పిటిషన్ పై హైకోర్టు నేడు విచారణ చేపట్టింది. తాము తీర్పు వెలువరించేంత వరకు అవినాశ్ రెడ్డిపై తీవ్ర చర్యలకు దిగొద్దంటూ సీబీఐని ఆదేశించింది. తీర్పును రిజర్వులో ఉంచింది. 

వాదనల సందర్భంగా ఎంపీ అవినాశ్ రెడ్డి న్యాయవాది పలు ఆసక్తికర అంశాలు ప్రస్తావించారు. ఈ హత్య వ్యవహారంలో వివేకా రెండో భార్య షమీమ్, ఆయన అల్లుడు రాజశేఖర్ ల పాత్రపై సీబీఐ విచారణ చేయడంలేదని తెలిపారు. ఇందులో ఆస్తి, కుటుంబ కలహాలు కూడా ఉన్నాయని, అన్ని అంశాలను దృష్టిలో ఉంచుకుని దర్యాప్తు జరపాలని కోరారు. 

కాగా, వివేకా హత్య కేసులో ఆయన కుమార్తె డాక్టర్ సునీతారెడ్డి ఇంప్లీడ్ పిటిషన్ లోని అంశాలు వెలుగుచూశాయి. లోక్ సభ టికెట్ కోసమే హత్య జరిగిందని, హత్య తర్వాత అందరు నిందితులను అవినాశ్ కాపాడుకుంటాడని ఎర్ర గంగిరెడ్డి మిగతా నిందితులతో చెప్పినట్టు ఇంప్లీడ్ పిటిషన్ లో పేర్కొన్నారు.

వివేకా హత్య గురించి అవినాశ్ కు ముందే తెలిసినప్పటికీ, థర్డ్ పార్టీ ద్వారా విషయం తెలుసుకుని అప్పుడు ముందుకు వెళ్లాలని భావించారని, ఆ విధంగానే శివప్రకాశ్ రెడ్డి ద్వారా సమాచారం అందుకున్న అవినాశ్... రెండు నిమిషాల్లోనే వివేకా ఇంటికి చేరుకున్నారని సునీతారెడ్డి ఆరోపించారు.


More Telugu News