ఆస్కార్ వేడుకలకు ఈ ముగ్గురు దిగ్గజాలు డుమ్మా!

  • అమెరికాలోని లాజ్ ఏంజెల్స్ లో అంగరంగ వైభవంగా ఆస్కార్ వేడుకలు
  • జేమ్స్ కామెరాన్, టామ్ క్రూస్, డెంజెల్ వాషింగ్టన్ గైర్హాజరు
  • ‘మిషన్ ఇంపాజిబుల్ 8’ షూటింగ్ వల్ల రాలేకపోయిన టామ్
  • ఎన్ బీఏ గేమ్ చూస్తూ గడిపిన డెంజెల్
  • బెస్ట్ డైరెక్టర్ నామినేషన్ దక్కలేదనే జేమ్స్ కామెరాన్ రాలేదని అప్పుడే చర్చ
ఆస్కార్.. ప్రపంచ సినీ రంగంలో ‘ఎవరెస్ట్’ లాంటిది. ఈ అవార్డుల ప్రదానోత్సవం అమెరికాలోని లాస్ ఏంజెల్స్ లో ఏటా అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ వేడుకల్లో పాల్గొనాలని, రెడ్ కార్పెట్ పై నడవాలని ఎంతో మంది కలలుగంటారు. అయితే ఈసారి అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి కొందరు హాజరు కాలేదు. వారిలో ముగ్గురు దిగ్గజాలు కూడా ఉండటం గమనార్హం. 

టైటానిక్, అవతార్ పేరుతో అద్భుతాలను స‌ృష్టించిన జేమ్స్ కామెరాన్, వెండి తెరపై స్టంట్లతో ఆశ్చర్యపరిచే టామ్ క్రూస్, లెజండరీ యాక్టర్ డెంజెల్ వాషింగ్టన్.. ఈ సారి ఆస్కార్ వేడుకలకు డుమ్మా కొట్టారు. ఒకటి కన్నా ఎక్కువ అవార్డుల నామినేషన్లలో ఉన్న జేమ్స్ కామెరాన్, టామ్ క్రూస్ గైర్హాజరీపై అప్పుడే చర్చ కూడా మొదలైంది. 

‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’ సినిమా నాలుగు కేటగిరీల్లో నామినేట్ అయింది. శనివారం రాత్రి (అమెరికా కాలమానం ప్రకారం) నామినీలతో జరిగిన డిన్నర్ కు జేమ్స్ కామెరాన్ హాజరయ్యారు. కానీ తర్వాతి రోజే జరిగిన అవార్డుల ప్రదానోత్సవానికి రాలేదు. ఇదే విషయాన్ని ఆస్కార్ హోస్ట్ జిమ్మీ కిమ్మెల్ ప్రస్తావించారు. అవతార్ 2పై జోక్ చేశారు. సినిమా 192 నిమిషాల రన్ టైం ఉండటాన్ని ఉద్దేశిస్తూ.. ‘‘మీకు తెలుసా..? ఒక ప్రదర్శన మరీ ఎక్కువ సేపు ఉంటే.. జేమ్స్ కామెరాన్ కూడా అంతసేపు కూర్చోలేరు’’ అని సెటైర్ వేశారు.

"ఉత్తమ దర్శకుడిగా నామినేట్ కాలేదన్న కారణంతోనే జేమ్స్ కామెరాన్‌ ఇక్కడ లేడని కొందరు అంటున్నారు. ఎంతో వినయం ఉన్న వ్యక్తి గురించి అలా అనుకోవడం కష్టంగా ఉంది. కానీ అందులోనూ పాయింట్ ఉంది. అవతార్‌కి దర్శకత్వం వహించిన వ్యక్తిని అకాడమీ ఎందుకు నామినేట్ చేయలేదు. అతడి గురించి మీరు ఏమనుకుంటున్నారు’’ అంటూ చమత్కరించారు.

‘మిషన్ ఇంపాజిబుల్’ హీరో టామ్ క్రూజ్ నటించిన ‘టాప్ గన్: మేవరిక్’ సినిమా ఆరు విభాగాల్లో నామినేట్ అయింది. అయితే టామ్ మాత్రం వేడుకలకు రాలేదు. దీనిపైనా జిమ్మీ కిమ్మెల్ స్పందించారు.

‘‘టాప్ గన్ ను అందరూ ఇష్టపడ్డారు. ఆ బీచ్ ఫుట్‌బాల్ సీన్‌లో టామ్ క్రూస్ చొక్కా విప్పి ఉన్నారు చూశారూ? .. హబ్బా హబ్బా!’’ అంటూ నవ్వించారు. ‘‘వేడుకల్లో టామ్ క్రూస్, జేమ్స్ కామెరాన్ ఇద్దరూ కనిపించలేదు. థియేటర్‌కి వెళ్దామని పట్టుబట్టిన ఇద్దరూ థియేటర్‌కి రాలేదు చూడండి’’ అని చెప్పుకొచ్చారు. అయితే ‘మిషన్ ఇంపాజిబుల్ 8’ షూటింగ్ లో భాగంగా విదేశాల్లో బిజీగా ఉండటం వల్లే ఆస్కార్ వేడుకలకు టామ్ క్రూస్ రాలేదని ఆయన అధికార ప్రతినిధి ఒకరు తర్వాత వెల్లడించారు. 

ఇక లెజెండరీ యాక్టర్ డెంజెల్ వాషింగ్టన్.. ఎన్ బీఏ గేమ్ చూస్తూ గడిపారు. డైరెక్టర్ స్పైక్ లీ తో కలిసి బాస్కెట్ బాల్ మ్యాచ్ ను చూస్తూ డెంజెల్ కనిపించారు. ఈ సారి అవార్డుల్లో లీ, డెంజెల్ కు నామినేషన్లు దక్కలేదు.


More Telugu News