ఆస్కార్ కు గుజరాత్ సినిమాను పంపారు కానీ, ఆర్ఆర్ఆర్ ను పంపలేదు: మంత్రి తలసాని

  • ఆస్కార్ బరిలో ఎగిరిన తెలుగు జెండా
  • ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు నాటు పాటకు ఆస్కార్ పురస్కారం
  • ఆర్ఆర్ఆర్ టీమ్ కు అభినందనలు తెలిపిన మంత్రి తలసాని
  • నాటు నాటు పాట టీమ్ ను సన్మానిస్తామని వెల్లడి
కేంద్రం ప్రభుత్వం ఈ ఏడాది ఆస్కార్ కు భారత్ తరఫున అధికారిక చిత్రంగా గుజరాతీ సినిమా 'ఛెల్లో షో'ని పంపిన సంగతి తెలిసిందే. అయితే ఆస్కార్ బరిలో ఆ సినిమా ఊసే ఎక్కడా వినిపించలేదు. పెద్దగా నామినేషన్లు పొందనప్పటికీ హాలీవుడ్ లో ఎక్కడ చూసినా ఆర్ఆర్ఆర్ తానే అన్న చందంగా సందడి చేసింది. 

అంతేకాదు, నామినేషన్ పొందిన బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటు నాటు పాట ఆస్కార్ సొంతం చేసుకుని యావత్ భారతదేశాన్ని సంతోష సాగరంలో ముంచెత్తింది. 

దీనిపై తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. ఆస్కార్ కు గుజరాత్ సినిమాను పంపించారు కానీ... ఆర్ఆర్ఆర్ సినిమాను మాత్రం పంపలేదని కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. ఆస్కార్ వేదిక మీద నాటు నాటు పాట ప్రదర్శన తెలుగు వాళ్లందరికీ గర్వకారణం అని కొనియాడారు. ఆర్ఆర్ఆర్ చిత్రబృందానికి అభినందనలు తెలుపుతున్నట్టు పేర్కొన్నారు. 

ఆస్కార్ గెలిచిన నాటు నాటు పాట టీమ్ కు తెలంగాణ ప్రభుత్వం సన్మానం ఏర్పాటు చేస్తుందని మంత్రి తలసాని వెల్లడించారు. తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.


More Telugu News