రైల్వే స్టేషన్‌లో ఇంగ్లండ్ క్రికెటర్ బెన్ స్టోక్స్ బ్యాగ్ చోరీ

  • సోషల్ మీడియాలో పేర్కొన్న బెన్ స్టోక్స్ 
  • కింగ్స్ క్రాస్ స్టేషన్లో తన బ్యాగును దొంగిలించారని వెల్లడి
  • దొంగలపై ట్విట్టర్ వేదికగా గుస్సా
ఇంగ్లండ్ క్రికెట్ కెప్టెన్ బెన్ స్టోక్స్‌కు స్వదేశంలోనే షాకింగ్ అనుభవం ఎదురైంది. ఓ రైల్వే స్టేషన్‌లో ఆయన బ్యాగు చోరీకి గురైంది. సిక్స్ నేషన్స్ టోర్నీలో భాగంగా ఇంగ్లండ్, ఫ్రాన్స్ జట్ల మధ్య జరగనున్న మ్యాచ్‌ను తిలకించేందుకు ఆయన రైల్‌లో లండన్‌ వెళ్లాడు. అయితే.. కింగ్స్ రైల్వే స్టేషన్‌లో దిగాక ఆయన బ్యాగ్‌ను ఎవరో కొట్టేశారు. దీంతో.. తిక్కరేగిన బెన్ స్టోక్స్ ట్విట్టర్‌ వేదికగా దొంగలకు శాపనార్థాలు పెట్టాడు.  ‘‘కింగ్స్ క్రాస్ స్టేషన్‌లో నా బ్యాగును ఎవరో కొట్టేశారు. వారికి నా దుస్తులు లూజ్ అవ్వాలని కోరుకుంటున్నా’’ అని ట్వీట్ చేశాడు. 

ఇంగ్లండ్‌ను టీ20 ప్రపంచం కప్ విజేతగా నిలిపిన బెన్ స్టోక్స్ త్వరలో భారత్‌లో జరగనున్న ఐపీఎల్-2023 లోనూ తన సత్తా చాటేందుకు ఉవ్విళ్లూరుతున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ అతడిని రూ.16.25 కోట్లకు దక్కించుకుంది. ఇక ఇటీవల న్యూజిల్యాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌ను ఇంగ్లండ్ జట్టు డ్రాగా ముగించింది. అంతకుమునుపు పాకిస్థాన్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో ఆతిథ్య టీంను ఇంగ్లండ్ 3-0 తేడాతో చిత్తుగా ఓడించింది. ప్రస్తుతం ఆట నుంచి విరామం తీసుకున్న బెన్ తన కుటుంబంతో గడుపుతున్నాడు.


More Telugu News