టైరు పేలి ప్రమాదం జరిగితే పరిహారం ఇవ్వాల్సిందే!: బాంబే హైకోర్టు తీర్పు

  • అది యాక్ట్ ఆఫ్ గాడ్ కిందికి రాబోదన్న బాంబే హైకోర్టు
  • ప్రమాదంలో గాయపడ్డా, మరణించినా పరిహారం చెల్లించాలి
  • బీమా క్లెయిమ్ కు సంబంధించిన కేసులో తీర్పు
వాహనం టైరు పేలి ప్రమాదం జరిగితే అది దైవ ఘటన (యాక్ట్ ఆఫ్ గాడ్) కిందికి రాదని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. ఈ ప్రమాదాన్ని మానవ తప్పిదంగానే పరిగణించాలని సూచించింది. ప్రమాదంలో గాయపడ్డవారికి పరిహారం ఇవ్వాల్సిందేనని తీర్పిచ్చింది. ఒకవేళ ఈ ప్రమాదంలో ఎవరైనా మరణిస్తే, బాధిత కుటుంబానికి నిర్ణీత మొత్తం పరిహారం చెల్లించాలని పేర్కొంది. ఈమేరకు న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ వర్సెస్ పట్వర్దన్ కేసులో బాంబే హైకోర్టు ఈ తీర్పు వెలువరించింది.

2010 అక్టోబరు 25న మకరంద్ పట్వర్ధన్ తన స్నేహితులతో కలిసి కలిసి పూణె నుంచి ముంబైకి కారులో బయల్దేరారు. వెనుక టైరు పేలడంతో కారు అదుపుతప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో పట్వర్దన్ మరణించారు. పరిహారం కోసం పట్వర్దన్ కుటుంబం న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీని ఆశ్రయించగా.. టైరు పేలడం యాక్ట్ ఆఫ్ గాడ్ అని పేర్కొంటూ బీమా కంపెనీ పరిహారం ఇవ్వలేమని తెలిపింది. దీనిపై పట్వర్దన్ కుటుంబం ట్రైబ్యునల్ ను ఆశ్రయించింది.

సుదీర్ఘ విచారణ తర్వాత 2016లో పట్వర్దన్ కుటుంబానికి అనుకూలంగా ట్రైబ్యునల్ తీర్పిచ్చింది. పట్వర్దన్ ఫ్యామిలీకి రూ.1.25 కోట్లు చెల్లించాలని బీమా కంపెనీని ఆదేశించింది. దీంతో న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ బాంబే హైకోర్టుకు అప్పీల్ చేయగా.. ట్రైబ్యునల్ తీర్పును హైకోర్టు సమర్థించింది. బాధిత కుటుంబానికి పరిహారం చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది.


More Telugu News