స్వలింగ వివాహాలను గుర్తించబోమన్న కేంద్రం

  • సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్ లో వెల్లడి
  • స్వలింగ సంపర్కం చట్టవిరుద్ధమని అనలేమన్న కేంద్రం
  • భారత కుటుంబ వ్యవస్థతో పోల్చలేమని వివరణ
స్వలింగ సంపర్కం చట్టవిరుద్ధమని అనలేం కానీ అలాంటి జంటల మధ్య జరిగే వివాహాన్ని గుర్తించబోమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. హిందూ కుటుంబ వ్యవస్థతో వాటిని పోల్చలేమని పేర్కొంది. ఈమేరకు స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించాలంటూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది. ఇందులో స్వలింగ వివాహాలకు గుర్తింపు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకమని తెలిపింది. ఈ వివాహాలకు గుర్తింపునివ్వడమంటే ఇప్పుడు అమలులో ఉన్న పర్సనల్ లా ను ఉల్లంఘించడమేనని వివరించింది. అయితే, ఇద్దరు వ్యక్తుల (ఒకే జెండర్) పరస్పర అంగీకారంతో జరిగే లైంగిక చర్య చట్ట విరుద్ధమని అనలేమని కేంద్రం తన అఫిడవిట్ లో పేర్కొంది.

వివాహ కార్యక్రమం అనేది స్త్రీ, పురుషులు (ఆపోజిట్ సెక్స్) ఒక్కటయ్యేందుకు ఉద్దేశించిన వ్యవహారం. సామాజికంగా, సాంస్కృతికంగా, న్యాయపరంగా ఆమోదం లభించిన కార్యక్రమం. న్యాయ వ్యవస్థ కల్పించుకుని ఇప్పుడు ఈ కాన్సెప్ట్ ను పలుచన చేయొద్దని కేంద్రం విజ్ఞప్తి చేసింది. ఇద్దరు వ్యక్తులు (సేమ్ సెక్స్) సహజీవనం చేయడం, జీవిత భాగస్వాములుగా ఉండాలని నిర్ణయించుకోవడం, ఇష్టపూర్వకంగా లైంగిక చర్యల్లో పాల్గొనడాన్ని భారతీయ కుటుంబ వ్యవస్థతో పోల్చలేమని కేంద్రం తెలిపింది. కుటుంబ వ్యవస్థలో భార్య, భర్త, పిల్లలు ఉంటారని, స్వలింగ వివాహాల విషయంలో భార్య లేదా భర్తలకు గుర్తింపు, నిర్వచనం ఇవ్వలేమని పేర్కొంది.


More Telugu News