జాతీయ, అంతర్జాతీయ సినిమాలు చేసే సత్తా నాకుంది: పవన్ కల్యాణ్

  • కాపు సంక్షేమ సేనతో పవన్ భేటీ
  • సినిమాలు వేరు, రాజకీయాలు వేరన్న పవన్
  • అందుకే ఓడిపోయానని వెల్లడి
  • సమాజంలో మార్పు కోసమే రాజకీయాల్లోకి వచ్చానని స్పష్టీకరణ
మంగళగిరి పార్టీ కార్యాలయంలో జనసేనాని పవన్ కల్యాణ్ కాపు సంక్షేమ సేన నేతల సమావేశంలో భావోద్వేగపూరితంగా ప్రసంగించారు. సినిమాలు వేరు, రాజకీయాలు వేరని... అందుకే ఓడిపోయానని వెల్లడించారు. తన అభిమానులు అన్ని కులాల్లో ఉన్నారని, వారికి తనపై అభిమానం ఉన్నా, ఎన్నికల్లో వాళ్ల కులాల నేతలకు ఓట్లు వేసుకున్నారని, వాళ్ల నిర్ణయాన్ని తాను గౌరవిస్తానని స్పష్టం చేశారు. 

కాపులంతా తనకు ఓటేసి ఉంటే భీమవరం, గాజువాకలో గెలిచేవాడినని అన్నారు. జాతీయ, అంతర్జాతీయ సినిమాలు చేసే సత్తా తనకుందని పవన్ స్పష్టం చేశారు. కానీ సమాజంలో మార్పు కోసమే రాజకీయాల్లోకి వచ్చానని వెల్లడించారు. రూ.100 కోట్లు సంపాదించిన తృప్తి కంటే, దివ్యాంగులను అక్కున చేర్చుకుంటే వచ్చే తృప్తి మిన్న అని తెలిపారు. 

ఇప్పుడున్న ముఖ్యమంత్రిలాగా తనకు వేల కోట్లు లేవని, కాన్షీరామ్ వంటి వారే పార్టీ నడపడంలో తనకు స్ఫూర్తి అని పేర్కొన్నారు. డబ్బు కంటే భావనాబలంతోనే పార్టీ నడపగలమని పవన్ కల్యాణ్ వివరించారు. అయితే ఇప్పటికీ జనసేనకు ఇంకా ప్రతికూల పవనాలే నడుస్తున్నాయని, అనుకూల పవనాలు రాలేదని అన్నారు. 

సొంత మీడియా లేకపోవడం కొన్ని కులాలకు ప్రతికూలంగా మారిందని అన్నారు. సంఖ్యా బలం ఉన్న కులాలు బలంగా గొంతుక వినిపించలేకపోతున్నాయని తెలిపారు. మీరేమో నన్ను దేవుడు, దేవుడు అంటారు... వాళ్లేమో నన్ను చంపుతున్నారు అంటూ సభలో నవ్వులు పూయించారు. బిగ్ బ్యాంగ్ థియరీ ప్రకారం విశ్వం విస్ఫోటనం చెందిందని, ఆ విధంగా ఏర్పడిన ప్రతి అణువులోనూ తాను భగవంతుడ్ని చూస్తానని వివరించారు.


More Telugu News