గంటకో కులం అనే వ్యక్తి పవన్ కల్యాణ్: మంత్రి బొత్స

  • నిన్న బీసీ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించిన పవన్
  • పవన్ ది సెలబ్రిటీ పార్టీ అన్న బొత్స
  • వైసీపీ బడుగు బలహీన వర్గాల పార్టీ అని వెల్లడి
  • పవన్ మూడ్ వస్తే మాట్లాడుతుంటాడని వ్యాఖ్యలు
జనసేనాని పవన్ కల్యాణ్ మంగళగిరిలో బీసీ రౌండ్ టేబుల్ సమావేశంలో చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. పవన్ కల్యాణ్ ది సెలబ్రిటీ పార్టీ, మూడ్ వస్తేనే మాట్లాడుతుంటాడని అని పేర్కొన్నారు. 

గంటకో కులం అనే వ్యక్తి పవన్ కల్యాణ్ అని విమర్శించారు. పొరుగు రాష్ట్రంలో బీసీలకు జరుగుతున్న అన్యాయంపై పవన్ ఎందుకు మాట్లాడడంలేదని నిలదీశారు. జగన్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ఆలోచనలో పవన్ కల్యాణ్ ఉన్నాడని బొత్స మండిపడ్డారు. నిర్దిష్టమైన లక్ష్యం ఉంటే నీతి, నిజాయతీతో పోరాడాలని హితవు పలికారు. అలా చేస్తే కనీసం ఏ 30 సంవత్సరాలకో అధికారం లభించే అవకాశం ఉంటుందని వ్యాఖ్యానించారు. అప్పటి వరకు ఏంచేసినా ప్రయోజనం ఉండదని అన్నారు.

ఇక తనపై జనసేనాని చేసిన విమర్శల పట్ల కూడా బొత్స బదులిచ్చారు. తాను రాజకీయాల్లోకి వచ్చి టాటా, బిర్లా మాదిరి ఎక్కడ ఎదిగిపోయానో చెప్పగలరా అంటూ పవన్ ను ప్రశ్నించారు. 

తన కంటే ముందు మంత్రులయిన వారు తూర్పు కాపు కులంలో చాలామంది ఉన్నారని, తాను వ్యక్తిగతంగా ఎంత అభివృద్ధి చెందానో పవన్ ను చూపించమనండి అంటూ బొత్స సవాల్ చేశారు. వైసీపీ... బడుగు బలహీన వర్గాల పార్టీ అని... బీసీలు తమ పార్టీకి, ప్రభుత్వానికి వెన్నెముక అని పేర్కొన్నారు.


More Telugu News