ఎఫ్ డీలపై వడ్డీ పెంచిన యాక్సిస్ బ్యాంకు.. వివరాలు ఇదిగో!

  • ఈ నెల 10 నుంచే అమలులోకి..
  • 45 రోజుల ఎఫ్ డీలకు 3.50 శాతం వడ్డీ
  • ఆరు నెలలకు పైబడిన ఎఫ్ డీలకు సీనియర్ సిటిజన్లకు 6 శాతం
ప్రైవేట్ రంగంలోని యాక్సిస్ బ్యాంకు తన ఖాతాదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఫిక్స్ డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించింది. పెరిగిన వడ్డీ రేట్లు ఈ నెల 10 నుంచే అమలులోకి వస్తాయని తెలిపింది. రూ.2 కోట్ల లోపు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీని బ్యాంకు పెంచింది. దీనిపై వడ్డీ రేటును 0.40 శాతం పెంచినట్లు తెలిపింది. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు ఆర్బీఐ రెపో రేటును సవరించిన తర్వాత దాదాపు అన్ని బ్యాంకులూ ఎఫ్ డీలపై వడ్డీని పెంచాయి.

యాక్సిస్ బ్యాంక్ వెబ్‌సైట్ ప్రకారం.. బ్యాంక్ 13 నెలలు, రెండేళ్లలోపు ఎఫ్ డీలపై వడ్డీ రేటును 40 బేసిస్ పాయింట్లు అంటే 0.40 శాతం పెంచింది. వడ్డీని 6.75 శాతం నుంచి 7.15 శాతానికి పెంచింది. 2 సంవత్సరాల నుంచి 30 నెలల వరకు ఫిక్స్ డ్ డిపాజిట్ చేసిన మొత్తంపై 7.26 శాతం వడ్డీని చెల్లిస్తోంది. ఇవి బ్యాంకు కొత్త వడ్డీ రేట్లు.

2 కోట్ల కంటే తక్కువ మొత్తాలపై..
  • 7 రోజుల నుంచి 45 రోజుల వరకు.. ఎఫ్ డీ మొత్తానికి 3.50 శాతం వడ్డీ
  • 46 రోజుల నుంచి 60 రోజుల వరకు 4.00 శాతం
  • 61 రోజుల నుంచి 3 నెలల లోపు ఎఫ్ డీలపై 4.50 శాతం
  • 3 నెలల నుంచి 6 నెలల లోపు.. 4.75 శాతం
  • 6 నెలల నుంచి 9 నెలల లోపు.. సాధారణ ప్రజలకు 5.75 శాతం; సీనియర్ సిటిజన్లకు 6.00 శాతం
  • 9 నెలల నుంచి 1 సంవత్సరం వరకు: సాధారణ ప్రజలకు 6.00 శాతం; సీనియర్ సిటిజన్లకు 6.25 శాతం
  • 1 సంవత్సరం, ఆపైన 25 రోజుల వరకు: సాధారణ ప్రజలకు 6.75 శాతం; సీనియర్ సిటిజన్లకు 7.50 శాతం
  • 1 సంవత్సరం 25 రోజుల నుంచి 13 నెలల కంటే తక్కువ: సాధారణ ప్రజలకు 7.10 శాతం; సీనియర్ సిటిజన్లకు 7.85 శాతం
  • 13 నెలల నుంచి 2 సంవత్సరాల కంటే తక్కువ: సాధారణ ప్రజలకు 7.15 శాతం; సీనియర్ సిటిజన్లకు 7.90 శాతం
  • 2 సంవత్సరాలు ఆపైన..: సాధారణ ప్రజలకు 7.26 శాతం; సీనియర్ సిటిజన్లకు 8.01 శాతం


More Telugu News