పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో రికార్డులే రికార్డులు.. పరుగుల వానలో తడిసిముద్దైన అభిమానులు!

  • 40 ఓవర్లలో 11 వికెట్ల నష్టానికి 515 పరుగుల నమోదు
  • టీ20ల్లో ఇదే అత్యధికం
  • 36 బంతుల్లోనే సెంచరీ చేసిన ఉస్మాన్ ఖాన్
పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)లో పలు రికార్డులు బద్దలయ్యాయి. ముల్తాన్ సుల్తాన్స్-క్వెట్టా గ్లాడియేటర్స్ మధ్య జరిగిన మ్యాచ్ ఇందుకు వేదికైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సుల్తాన్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 262 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఫలితంగా 17 జూన్ 2021లో అబుధాబిలో పెషావర్ జల్మ‌ితో జరిగిన మ్యాచ్‌లో ఇస్లామాబాద్ యునైటెడ్ సాధించిన 247/2 పరుగుల రికార్డు బద్దలైంది.

తాజా మ్యాచ్‌లో సుల్తాన్ స్కిప్పర్ మొహమ్మద్ రిజ్వాన్ బంతులను ఆడేసుకున్నాడు. 29 బంతుల్లో 55 పరుగులు సాధించి జట్టు భారీ స్కోరు చేయడంలో తనవంతు పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సుల్తాన్స్ బ్యాటర్ ఉస్మాన్ ఖాన్ గురించి. మైదానంలో ఉస్మాన్ చెలరేగిపోయాడు. బంతులను ఇష్టం వచ్చినట్టు బాదుతూ పరుగుల వర్షం కురిపించాడు. 43 బంతుల్లో 12 ఫోర్లు, 9 సిక్సర్లతో 120 పరుగులు చేశాడు. 36 బంతుల్లోనే వంద పరుగులు పూర్తిచేసుకున్న ఉస్మాన్ పీఎస్ఎల్ చరిత్రలోనే అత్యంత వేగంగా సెంచరీ సాధించిన ఘనత సొంతం చేసుకున్నాడు.

ఈ మ్యాచ్‌లో మరో రికార్డు కూడా నమోదైంది. ఈ మ్యాచ్‌లో మొత్తంగా 40 ఓవర్లలో 11 వికెట్ల నష్టానికి 515 పరుగులు నమోదయ్యాయి. టీ20ల్లో ఇంత భారీ స్కోరు నమోదు కావడం ఇదే తొలిసారి. గతేడాది అక్టోబరులో పోచెఫ్‌స్ట్రూమ్‌లో నైట్స్-టైటాన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో 12 వికెట్ల నష్టానికి 501 పరుగులు నమోదయ్యాయి. ఇప్పుడా రికార్డు బద్దలైంది. 

అలాగే, ఈ మ్యాచ్‌లో పవర్ ప్లేలో సుల్తాన్స్ జట్టు 75 పరుగులు పిండుకుంది. పదో ఓవర్‌లో ఉస్మాన్ (120) అవుట్ కావడంతో 157 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. ఇక, 15వ ఓవర్లోనే స్కోరు 200 పరుగుల మైలురాయిని దాటింది. ఈ మ్యాచ్‌లో సుల్తాన్స్ సాధించిన 262 పరుగులు ఈ టోర్నీలోనే అత్యధికం. ఓవరాల్‌గా ఐదోది.

సుల్సాన్స్ నిర్దేశించిన 263 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన క్వెట్టా గ్లాడియేటర్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 253 పరుగులు చేసి ఓటమి పాలైంది. 13 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసినప్పటికీ ఆ తర్వాత వికెట్లు వెంటవెంటనే కోల్పోవడంతో ఓటమి తప్పలేదు.


More Telugu News