కవితపై బండి సంజయ్ వ్యాఖ్యలను సమర్థించిన డీకే అరుణ

  • కవితపై ఈడీ విచారణ
  • అరెస్ట్ చేయకుండా ముద్దుపెట్టుకుంటారా అన్న బండి సంజయ్
  • ఆందోళనలు చేపట్టిన బీఆర్ఎస్ కార్యకర్తలు
  • తెలంగాణలో ఉన్న నానుడిని బండి సంజయ్ ప్రస్తావించారన్న అరుణ
లిక్కర్ స్కాంలో కవితను అరెస్ట్ చేయకుండా, ముద్దు పెట్టుకుంటారా? అంటూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగడం తెలిసిందే. దీనిపై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ స్పందించారు. 

బండి సంజయ్ వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పులేదని అన్నారు. తెలంగాణలో వాడుకలో ఉన్న నానుడిని బండి సంజయ్ ప్రస్తావించారని తెలిపారు. చిన్న విషయాన్ని బీఆర్ఎస్ నేతలు రాద్ధాంతం చేస్తున్నారని డీకే అరుణ విమర్శించారు. గవర్నర్ తమిళిసైని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి తిట్టినప్పుడు వీరంతా ఏంచేశారని ప్రశ్నించారు. కేసీఆర్ కుమార్తె తప్ప మిగతావాళ్లు ఆడబిడ్డలు కాదా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

బండి సంజయ్ వ్యాఖ్యల పట్ల బీఆర్ఎస్ కార్యకర్తలు ఢిల్లీలోనూ, హైదరాబాదులోనూ ఆందోళనలు చేపట్టారు. హైదరాబాదులో గవర్నర్ ను కలిసి బండి సంజయ్ పై ఫిర్యాదు చేసేందుకు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ఎమ్మెల్యే గొంగడి సునీత, బీఆర్ఎస్ కార్పొరేటర్లు ప్రయత్నించారు. అయితే అపాయింట్ మెంట్ లేదంటూ పోలీసులు వారిని రాజ్ భవన్ గేటు వద్దే నిలిపివేశారు. 

ఈ నేపథ్యంలోనే డీకే అరుణ పైవిధంగా స్పందించారు. కవితపై ఈడీ విచారణ నుంచి దృష్టి మళ్లించేందుకే బీఆర్ఎస్ ధర్నాలు చేపడుతోందని విమర్శించారు.


More Telugu News