ఏపీలో ఇంటర్ పరీక్షల నిర్వహణపై సీఎస్ జవహర్ రెడ్డి సమీక్ష

  • మార్చి 15 నుంచి ఇంటర్ పరీక్షలు
  • అధికారులతో సీఎస్ వీడియో కాన్ఫరెన్స్
  • రాష్ట్రంలో 1,489 పరీక్ష కేంద్రాల ఏర్పాటు
  • ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు
ఏపీలో మార్చి 15 నుంచి ఏప్రిల్ 4 వరకు ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో, ఇంటర్ పరీక్షల నిర్వహణపై రాష్ట్ర సీఎస్ జవహర్ రెడ్డి సమీక్ష చేపట్టారు. కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 

అన్ని పరీక్ష కేంద్రాల్లో తాగునీరు అందుబాటులో ఉంచాలని సీఎస్ సూచించారు. ప్రతి 20-25 పరీక్ష కేంద్రాలకు ఒక అంబులెన్స్ సేవలు అందుబాటులో ఉండాలని తెలిపారు. పరీక్ష కేంద్రాలకు విద్యార్థులు సకాలంలో చేరేలా ఆర్టీసీ బస్సులు నడపాలని పేర్కొన్నారు. ప్రశ్నాపత్రాల లీకేజీ, మాల్ ప్రాక్టీస్ తదితర వదంతులను నియంత్రించాలని సీఎస్ అధికారులకు స్పష్టం చేశారు. పరీక్షలు జరిగే తేదీల్లో జిరాక్స్ కేంద్రాలు మూసేయించాలని చెప్పారు. 

రాష్ట్రంలో 10,03,674 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాయనుండగా, మొత్తం 1,489 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు సీఎస్ వెల్లడించారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇంటర్ పరీక్షలు జరుగుతాయని తెలిపారు.


More Telugu News