రష్యా, ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించేందుకు పరిష్కారం చెప్పిన చాట్ జీపీటీ!

  • రష్యా, ఉక్రెయిన్ మధ్య ఏడాదిగా కొనసాగుతున్న యుద్ధం
  • దీన్ని ఆపేందుకు మధ్యవర్తిత్వ ప్రణాళికను సూచించాలని చాట్ జీపీటీని అడిగిన మాజీ బ్యూరోక్రాట్
  • 8 అంశాలను పాటిస్తే యుద్ధానికి పరిష్కారం లభించే అవకాశం ఉందన్న చాట్ జీపీటీ

ఏడాది కాలంగా రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతోంది. రెండు దేశాలు ఎంతో నష్టపోయాయి. ఈ ప్రభావం ప్రపంచంపైనా ఎంతో పడింది. యుద్ధాన్ని నివారించేందుకు, ఆపేందుకు ప్రపంచ దేశాల నేతలు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. అసలు యుద్ధం ఎప్పుడు ముగిసిపోతుందన్నది, పరిష్కారం ఏంటన్నది ప్రశ్నార్థకంగా మారింది.

ఈ నేపథ్యంలో సాంకేతిక రంగంలో సంచలనంగా మారిన ‘చాట్ జీపీటీ’.. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ముగించేందుకు పరిష్కార మార్గాలు చెప్పింది. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి వికాస్ స్వరూప్ అడిగిన ప్రశ్నకు చాట్ జీపీటీ సుదీర్ఘ సమాధానమిచ్చింది. 

ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం విషయంలో మధ్య వర్తిత్వ ప్రణాళికను సూచించాలని చాట్ జీపీటీని వికాస్ స్వరూప్ కోరారు. దీనికి 8 పాయింట్లతో కూడిన పరిష్కారాన్ని చాట్ జీపీటీ చూపింది. ‘‘రష్యా, ఉక్రెయిన్ మధ్య ఘర్షణలు క్లిష్టమైనవి. ఇరుపక్షాలకు ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని కనుగొనడం సవాలుతో కూడుకున్నదే. చర్చలు.. కాల్పుల విరమణ.. అధికార వికేంద్రీకరణ, రెండు దేశాలు ఆయా ఒప్పందాలను పాటించడంపై అంతర్జాతీయ పర్యవేక్షణ.. ఆర్థిక సహకారం.. ఉక్రెయిన్ సార్వభౌమత్వాన్ని గుర్తించడం.. సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణ, సైనిక బలగాల ఉపసంహరణ.. అనే 8 అంశాలను పాటిస్తే యుద్ధానికి పరిష్కారం లభించే అవకాశం ఉంది’’ అని తెలిపింది. 

చాట్ జీపీటీ ఇచ్చిన జవాబును సోషల్ మీడియాలో వికాస్ స్వరూప్ పోస్ట్ చేశారు. దీనిపై కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వికాస్ స్వరూప్ చొరవ ఆసక్తకరమే కానీ.. రష్యా, ఉక్రెయిన్ దేశాల అధినేతలు.. కృత్రమ మేధ అంచనాలకు మించి ప్రవర్తించేవారని చెప్పారు. యుద్ధం విషయంలో చాట్ జీపీటీ ఇచ్చిన సమాధానంపై అభ్యంతరాలు రావచ్చని అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ ఇది గొప్ప ప్రయోగమని వికాస్ స్వరూప్ ను ప్రశంసించారు.


More Telugu News