మరో దేశంలో టిక్ టాక్ పై పాక్షిక బ్యాన్!

  • ప్రభుత్వ ఉద్యోగులు టిక్ టాక్ వాడటంపై నిషేధం విధించిన బెల్జియం
  • పెద్ద మొత్తంలో డేటాను సేకరించే ప్రమాదం ఉందన్న హెచ్చరికలతో నిర్ణయం
  • మన డేటా భద్రత మనకు ముఖ్యమన్న బెల్జియం ప్రధాని
  • తప్పుడు సమాచారం ఆధారంగా తీసుకున్న నిర్ణయంతో నిరాశ చెందామన్న టిక్ టాక్
చైనాకు చెందిన వీడియో యాప్ ‘టిక్ టాక్’ను ఒక్కో దేశం నిషేధిస్తూ పోతోంది. భద్రతా కారణాల ద‌ృష్ట్యా ఈ యాప్ వాడకాన్ని పలు దేశాలు బ్యాన్ చేస్తున్నాయి. తొలుత భారతదేశంలో టిక్ టాక్ ను పూర్తిగా బ్యాన్ చేసిన విషయం తెలిసిందే. తర్వాత అమెరికాలో పాక్షికంగా, ఇటీవల కెనడాలో పూర్తిగా నిషేధించారు. తాజాగా టిక్ టాక్ పై బెల్జియం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

ప్రభుత్వ ఉద్యోగులు టిక్ టాక్ వాడటంపై బెల్జియం నిషేధం విధించింది. తమ ఫోన్లలో ఈ యాప్ ను ఉపయోగించరాదని ఆ దేశ ప్రధానమంత్రి అలెగ్జాండర్ డీ క్రూ ఆదేశాలిచ్చారు. ‘‘చైనాలోని బైట్‌ డాన్స్ కు చెందిన టిక్‌టాక్.. పెద్ద మొత్తంలో డేటాను సేకరించే ప్రమాదం ఉందని బెల్జియం జాతీయ భద్రతా మండలి హెచ్చరించింది. చైనా ఇంటెలిజెన్స్ సర్వీసులకు బైట్‌ డాన్స్ కంపెనీ సహకరించాల్సి ఉంటుందని కూడా చెప్పింది. ఇదే వాస్తవం’’ అని ఆయన ఓ ప్రకటనలో వెల్లడించారు. ‘‘అందుకే ప్రభుత్వం అందించిన ఫోన్లలో టిక్‌టాక్ వినియోగాన్ని నిషేధిస్తున్నాం. మన సమాచార భద్రత మనకు ముఖ్యం’’ అని చెప్పారు.

బెల్జియం ప్రభుత్వ నిర్ణయంపై టిక్ టాక్ స్పందించింది. ప్రాథమికంగా తప్పుడు సమాచారం ఆధారంగా తీసుకున్న నిర్ణయంతో తాము నిరాశ చెందామని తెలిపింది. యూజర్ల డేటాను అమెరికా, సింగపూర్ లో భద్రపరుస్తున్నామని, యూరప్ లోనూ డేటా సెంటర్లను నిర్మిస్తున్నామని చెప్పింది. ఇతర దేశాల భూభాగంలో భద్రపరిచిన డేటాను పంచుకోవాలని చైనా ప్రభుత్వం బలవంతం చేయదని చెప్పుకొచ్చింది. 

తమ ఉద్యోగుల ఫోన్లలో టిక్ టాక్ వినియోగాన్ని బ్యాన్ చేస్తూ ఇటీవల యూరోపియన్ కమిషన్, యూరోపియన్ పార్లమెంట్ నిర్ణయం తీసుకున్నాయి. ఇక ప్రభుత్వానికి సంబంధించిన ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ డివైస్ లలో టిక్ టాక్ ఉపయోగించడానికి వీలు లేదని కొన్ని నెలల కిందట అమెరికా ప్రకటించింది. దేశంలో పూర్తిగా టిక్ టాక్ పై నిషేధం విధించేందుకు సిద్ధం చేసిన బిల్లుకి ఇటీవల వైట్ హౌస్ ఆమోదం తెలిపింది.


More Telugu News