చిన్నారుల కిడ్నాప్ కేసు.. అత్యుత్సాహంతో చిక్కుల్లో పడిన మహారాష్ట్ర పోలీసులు!

  • పర్బానీ జిల్లాలో వరుస కిడ్నాప్‌లు
  • జగయ్యపేట మహిళలు కిడ్నాప్ చేసినట్టు గుర్తించిన పోలీసులు
  • రెండు విడతలుగా జగ్గయ్యపేట వచ్చి నలుగురు చిన్నారులను తీసుకెళ్లిన ‘మహా’ పోలీసులు
  • వారిలో ఇద్దరిపై కేసులే లేకపోవడంతో నాలుక్కరుచుకున్న వైనం
  • వారిద్దరినీ తీసుకెళ్లాలని తల్లిదండ్రులకు కబురు
పిల్లల కిడ్నాప్ కేసులో ఇటీవల జగ్గయ్యపేట వచ్చి నలుగురు చిన్నారులను తీసుకెళ్లిన మహారాష్ట్ర పోలీసులు యూటర్న్ తీసుకున్నారు. వారు తీసుకెళ్లిన నలుగురిలో ఇద్దరిపై ఎలాంటి కేసులు లేకపోవడమే అందుకు కారణం. ఆ ఇద్దరినీ తీసుకెళ్లాలంటూ జగయ్యపేట పోలీసుల ద్వారా వారి తల్లిదండ్రులకు పోలీసులు సమాచారం అందించారు. 

మహారాష్ట్రలోని పర్బానీ జిల్లాలో చిన్నారులు వరుసగా అదృశ్యం కావడం కలకలం రేపింది. ఆంధ్రప్రదేశ్‌లోని జగ్గయ్యపేటకు చెందిన ఇద్దరు మహిళలు కిడ్నాప్ చేసినట్టు గుర్తించారు. దీంతో జగ్గయ్యపేట వచ్చిన పోలీసులు దేచుపాలం నుంచి మహమ్మద్ హైదర్ (4)ను తీసుకెళ్లారు. రెండోసారి మళ్లీ వచ్చి జగయ్యపేట నుంచి చరణ్ (4), దేచుపాలెం నుంచి సుభానీ (8), విస్సన్నపేట నుంచి ఆరిఫ్ (7)ను తీసుకెళ్లారు. ఈ క్రమంలో మహారాష్ట్ర పోలీసులకు స్థానిక పోలీసులు సహకరించారు. 

అంతవరకు బాగానే ఉంది కానీ, చిన్నారులను మహారాష్ట్రకు తీసుకెళ్లాక మరో విషయం తెలిసి పోలీసులు విస్తుపోయారు. చరణ్, సుభానీలపై అసలు కేసులే లేవని, కాబట్టి వారిద్దరినీ తీసుకెళ్లాలంటూ జగ్గయ్యపేట పోలీసుల ద్వారా వారి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న బాధిత తల్లిదండ్రులు తమ పిల్లలను తీసుకెళ్లింది వారే కాబట్టి తిరిగి వారే తీసుకొచ్చి అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో పోలీసులకు ఏం చేయాలో పాలుపోక తలలు పట్టుకున్నారు. అయితే, పిల్లలను వెనక్కి ఇచ్చే విషయంలో చట్టపరంగా ఎలాంటి ఇబ్బంది ఉండదని చెబుతున్నారు.


More Telugu News