లంచం డిమాండ్ చేసిన అధికారి.. కార్యాలయానికి ఎద్దును తోలుకొచ్చిన రైతు!

  • కర్ణాటకలోని హవేరి జిల్లాలో ఘటన
  • లంచం తీసుకున్నఅధికారి బదిలీ
  • కొత్తగా వచ్చిన అధికారి కూడా లంచం డిమాండ్
  • ఎద్దుతో రావడంతో కార్యాలయంలో కలకలం
  • ఉన్నతాధికారుల సీరియస్
లంచం తీసుకున్న అధికారి పని చేయకుండానే బదిలీ అయ్యాడు. కొత్తగా వచ్చిన అధికారి కూడా లంచం డిమాండ్ చేశాడు. డబ్బు ఇస్తేనే పని జరుగుతుందని తేల్చి చెప్పాడు. దీంతో ఏం చేయాలో పాలుపోని ఆ రైతు తన వద్ద ఉన్న ఎద్దునే లంచంగా ఇవ్వాలనుకున్నాడు. దానినే కార్యాలయానికి తీసుకెళ్లాడు. దీంతో అక్కడ ఒక్కసారిగా కలకలం రేగింది. 

కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై సొంత జిల్లా అయిన హవేరిలో జరిగిందీ ఘటన. జిల్లాలోని సవనూర్ మునిసిపాలిటీకి చెందిన ఎల్లప్ప రానోజి అనే రైతు మునిసిపల్ రికార్డుల్లో మార్పు కోసం దరఖాస్తు చేసుకున్నారు. పని చేసి పెట్టేందుకు సంబంధిత అధికారి లంచం డిమాండ్ చేశాడు. మరో దారిలేక లంచం సమర్పించుకున్నప్పటికీ పని చేయకుండానే ఆ అధికారి బదిలీ అయ్యాడు.

దీంతో కథ మళ్లీ మొదటికొచ్చింది. కొత్తగా వచ్చిన అధికారి కూడా పనిచేసి పెట్టేందుకు లంచం అడిగాడు. అంతకుముందున్న అధికారికి సమర్పించుకున్నానని, ఆయన పనిచేయకుండానే బదిలీ అయ్యారని, తన వద్ద డబ్బుల్లేవని బతిమాలినా ఆఫీసర్ గారి మనసు కరగలేదు. పైసలిస్తేనే పని జరుగుతుందని కరాఖండీగా తేల్చి చెప్పేశాడు. 

దీంతో ఏం చేయాలో పాలుపోని రైతు ఎల్లప్ప తనకున్న ఎద్దుల్లో ఒకదానిని కార్యాలయానికి తీసుకొచ్చి డబ్బులకు బదులుగా ఎద్దును లంచంగా తీసుకోవాలని బతిమాలాడు. దీంతో కార్యాలయంలో ఒక్కసారిగా కలకలం రేగింది. విషయం కాస్తా ఉన్నతాధికారులకు తెలియడంతో స్పందించారు. లంచం అడిగిన అధికారులకు షోకాజ్ నోటీసు జారీ చేశారు. ఎల్లప్పకు పనిచేసి పెడతామని హామీ ఇచ్చారు.


More Telugu News