అధిక ఉప్పు వల్లే గుండెపోట్లు: డబ్ల్యూహెచ్ఓ

  • నివేదిక విడుదల చేసిన డబ్ల్యూహెచ్ఓ
  • నిర్దేశించిన మేరకు సగటు ఉప్పు వినియోగం 5 గ్రాములు
  • కానీ రోజు 10.8 గ్రాముల ఉప్పు వాడుతున్నారన్న డబ్ల్యూహెచ్ఓ
  • హఠాన్మరణాలకు ఇదే కారణమన్న టెడ్రోస్ అథనోమ్
ఇటీవల కాలంలో గుండెపోటుతో హఠాన్మరణాల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. ఇది ఏ ఒక్క ప్రాంతానికో చెందిన సమస్య కాదు. ప్రపంచవ్యాప్తంగా హార్ట్ అటాక్ లతో అత్యధిక సంఖ్యలో మరణాలు చోటుచేసుకుంటుండడం పట్ల ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఆందోళన వ్యక్తం చేసింది. ఈ పరిణామాలపై డబ్ల్యూహెచ్ఓ నివేదిక వెలువరించింది. 

ఉప్పు అధికంగా వాడడం వల్లే గుండెపోట్లు వస్తున్నాయని వెల్లడించింది. సోడియం (ఉప్పు) మోతాదు హెచ్చితే అనారోగ్య సమస్యలు వస్తాయని వివరించింది. మితిమీరిన ఉప్పు వాడకం వల్ల గుండెపోటు మాత్రమే కాకుండా... ఊబకాయం, బోలు ఎముకల వ్యాధి, గ్యాస్ట్రిక్ క్యాన్సర్, కిడ్నీ వ్యాధులు కూడా వస్తాయని సదరు నివేదిక చెబుతోంది. 

2025 నాటికి ప్రపంచంలో సోడియం వినియోగాన్ని తగ్గించాలన్న లక్ష్యం ఆచరణలో కనిపించడంలేదని డబ్ల్యూహెచ్ఓ విచారం వ్యక్తం చేసింది. ఉప్పు వాడకం తగ్గిస్తే 2030 నాటికి 70 లక్షల మంది ఆరోగ్యాన్ని కాపాడవచ్చని డబ్ల్యూహెచ్ఓ నివేదిక చెబుతోంది. అయితే సోడియం విషయంలో డబ్ల్యూహెచ్ఓ సిఫారసులను ప్రపంచంలో కేవలం 9 దేశాలే అమలు చేస్తున్నాయి. 

డబ్ల్యూహెచ్ఓ నిర్దేశించిన ప్రమాణాల మేరకు రోజుకు సగటున 5 గ్రాముల ఉప్పు (సోడియం) మాత్రమే తీసుకోవాలి. కానీ, అందుకు విరుద్ధంగా ప్రపంచంలో సగటున 10.8 గ్రాములు ఉప్పు తీసుకుంటున్నట్టు వెల్లడైంది. హఠాన్మరణాలకు ఇటువంటి అనారోగ్యకర ఆహారపు అలవాట్లే కారణమని ప్రపంచ ఆరోగ్య సంస్థ అధిపతి టెడ్రోస్ అథనోమ్ పేర్కొన్నారు.


More Telugu News