ఆస్కార్‌ మాకు ఒలింపిక్‌ గోల్డ్ మెడల్‌తో సమానం: రామ్‌చరణ్‌

  • అమెరికాలో కొనసాగుతున్న చరణ్ సందడి 
  • 'RRR'కు పనిచేయడం మాటల్లో వర్ణించలేనిదని వ్యాఖ్య
  • స్నేహబంధం వల్లే 'నాటు నాటు పాట' గొప్పగా వచ్చిందని వెల్లడి
  • ఆస్కార్ నామినేషన్ విలువ నాన్నకి తెలుసన్న చరణ్
  • తండ్రి క్రమశిక్షణ గురించిన ప్రస్తావన 
'RRR'లోని 'నాటు నాటు' పాట ఆస్కార్‌ బరిలో ఉంది ఈ పాటలో చరణ్‌ వేసిన స్టెప్పులు, చూపించిన గ్రేస్‌కి అభిమానులు ఫిదా అవుతున్నారు. ఈ సందర్భంగా టాక్‌ ఈజీ షోలో సామ్‌ ఫ్రగోసోతో చరణ్‌ మాట్లాడారు. 50 నిమిషాల పాటు సాగిన పాడ్‌కాస్ట్ లో ఎన్నో విషయాల గురించి చరణ్‌ స్పందించారు. ఈ టాక్‌ కేవలం 'RRR'తోనో, ఎస్‌ ఎస్‌ రాజమౌళితోనో, ఆస్కార్‌కి నామినేట్‌ అయిన నాటు నాటు పాటతో ఆగలేదు .. అంతకు మించి సాగింది.

చరణ్ బాల్యం, ఆయన పెరిగిన విధానం, తండ్రి చిరంజీవి క్రమశిక్షణ, తన దృష్టిలో ఆస్కార్‌ అంటే ఏంటి? వంటి విషయాలతో పాటు ఇంకా చాలా చాలా అంశాలపై ఈ సంభాషణ సాగింది. ఇందులో సరదా విషయం ఏంటంటే, తన మహిళా ఫ్యాన్స్ పంపిన కొన్ని మెసేజ్‌లను చరణ్‌తో చదివించడం .. వాటిని చదువుతూ చరణ్‌ మొహమాట పడటం .. సిగ్గుపడటం అందరి దృష్టినీ ఆకట్టుకుంది. చరణ్‌ చెప్పిన కొన్ని విషయాలు ..

నాటు నాటు విశేషాలు .. 
నాటు నాటు పాట కేవలం వినోదాత్మకంగా ఉండదు. ఆ సీక్వెన్స్‌ని రాజమౌళి చాలా అర్థవంతంగా తెరకెక్కించారు. ఆ పాటలో ఉన్న డ్రామా, ఎమోషన్స్ వల్లనే ఆ పాట ఆస్కార్‌ గడపను తొక్కగలిగింది. అవతలివారిని ఓడించిన తర్వాత తమలో తాము పోటీపడిన ఇద్దరు యువకులు, వారి ఆసక్తి, వారి పోటీతత్వం, ఉల్లాసం, హుషారు... ఇలాంటివన్నీ ఆ పాటను అత్యంత ప్రత్యేకంగా తీర్చిదిద్దాయి.

ప్రతి అడుగూ మాకు చాలా చాలెంజింగ్‌గా అనిపించింది. ఒకే ఒక స్ట్రెచ్‌ని దాదాపు రెండు రోజులు చిత్రీకరించాం. ఇద్దరి అడుగులూ, ఊపునూ ఒకేలా సింక్రనైజ్‌ చేయడం చాలా కష్టంగా అనిపించింది. ప్రతి స్టెప్పూ, ప్రతి కోణంలోనూ పర్ఫెక్ట్ గా కుదిరింది. కీరవాణి అద్భుతమైన బీట్స్ ఇచ్చారు. పాట అంత అద్బుతంగా రావడానికి ఆయనే ప్రధాన కారణం. ఉక్రెయిన్‌లో నాటు నాటు పాట కోసం మేం స్టెప్పులు వేస్తున్న సమయంలోనే యుద్ధమేఘాలు ఆవరించాయి. ఉక్రెయిన్‌ ప్రెసిడెంట్‌ ఆయన ప్యాలస్‌లో మమ్మల్ని షూటింగ్‌ చేసుకోనిచ్చారు. చాలా బాగా అనిపించిన క్షణాలవి.

జక్కన్న అపరమేధావి!
కథ డిమాండ్‌ చేసిందనో, కేరక్టర్లు డిమాండ్‌ చేశాయనో కాదు, నన్నూ, తారక్‌నీ ఈ ప్రాజెక్ట్ లో పనిచేయించాలన్న గట్టి సంకల్పం రాజమౌళిగారిది. సెట్లో ఏక కాలంలో పది మంది స్టార్‌ హీరోలను కూడా హ్యాండిల్‌ చేయగల సత్తా రాజమౌళిగారి సొంతం. నా సోదరుడు తారక్‌తో పనిచేయడం అత్యంత సులువుగా, హాయిగా అనిపించింది. ఈ సినిమాకు పనిచేయడం మొదలుపెట్టినప్పుడు నాకు అలౌకికానందం కలిగింది. 

అత్యద్భుతమైన ట్రిపుల్‌ ఆర్‌!
ఓ నటుడిగా నేను మా దర్శకుడి మనసులోకి దూరి, ఆయనేం అనుకుంటున్నారో అర్థం చేసుకుని కెమెరా ముందు ఆవిష్కరించాల్సి ఉంటుంది. అందులోనూ ట్రిపుల్‌ ఆర్‌ మల్టీజోనర్‌ సినిమా. ఇందులో బోలెడన్ని థీమ్స్, అంశాలున్నాయి. ఏ ఒక్క జోనర్‌లోనో తోసేసే విషయం కాదు. చిత్రంలోని ప్రతి అంశం ఆడియన్స్‌కి కనెక్ట్ కావాలి. చిత్రంలో భావోద్వేగానికున్న భాషను, ఉద్దేశాన్ని అర్థం చేసుకోవాలి.

రామరాజు కేరక్టర్‌లో చాలా లేయర్స్ ఉంటాయి. అతని నిజమైన ఉద్దేశాన్ని అతను దాచుకుని ప్రవర్తించాలి. ఎన్నో వేరియేషన్లతో కూడుకున్న అత్యంత అందమైన కేరక్టర్‌ అది. ఆ రోల్‌ చేసిన తర్వాత నాకు చాలా అద్భుతంగా అనిపిస్తోంది. ఇప్పటికీ ఆ పాత్రతో గట్టి అనుబంధం ఉన్నట్టు, నాకు చాలా సన్నిహితంగా ఉన్నట్టు అనిపిస్తోంది ఆ పాత్ర.

హాలీవుడ్‌ జర్నీ!
సినిమాను ఆరాధించే ఏ దేశానికి సంబంధించిన చిత్రంలోనైనా నటించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మనం కోరుకుంటే సరిపోదు. దానికి తగ్గట్టు ప్రణాళిక చేయాలి. దాన్ని సాకారం చేసుకోవాలి. నేను ఆ దిశగానే చర్చలు జరుపుతున్నాను. మాటల దశలో ఉన్నాయి. అయితే అవి సినిమాలుగా ఎలా షేప్‌ తీసుకుంటాయన్నది చూడాలి. కొన్ని నెలల్లో వాటికి సంబంధించిన విషయాలు తెలుస్తాయి.

నాకు జూలియా రాబర్ట్స్‌తో పనిచేయాలని ఉంది. ఇండియాలో ఆమెకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. టామ్‌ క్రూయిజ్‌నీ, బ్రాడ్‌పిట్‌నీ, జూలియా రాబర్ట్స్ నీ ఇష్టపడనివారు ఎవరుంటారు? ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. నన్ను ఇండియన్‌ బ్రాడ్‌పిట్‌ అంటుంటే చాలా ఆశ్చర్యంగా అనిపించింది.

భారీ ప్రాజెక్టులతో పనిచేయడం!
నా పాత్ర గురించి, నేను చేయాల్సిన పని గురించి నాకు పూర్తిగా తెలిసినప్పటికీ, నాకంతా తెలుసన్నట్టు నేనెప్పుడూ ప్రవర్తించలేదు. నేను సెట్లోకి వెళ్లగానే, మా దర్శకుడితో ఎక్కువగా మాట్లాడేవాడిని. నాకు అంతా అర్థంకానట్టే అనిపించేది. ఎప్పటికప్పుడూ డైరక్టర్‌ని వందలాది ప్రశ్నలు అడుగుతుంటే నాకే ఇబ్బందిగా అనిపించేది. చాలా విషయాలు తెలిసినా తెలియనట్టే ఉండాలి. అన్నీ తెలుసన్నట్టు ప్రవర్తించకూడదు.

నా దృష్టిలో ఆస్కార్‌!
మా దృష్టిలో ఆస్కార్‌ అనేది ఓ భావోద్వేగం. అక్కడ వెయిట్‌ చేస్తున్న మా నాన్నకు ఎమోషనల్‌ విషయం. మా సినిమా 'నాటు నాటు' ఆస్కార్‌కి రావడాన్ని మా నాన్న చాలా సెంటిమెంట్‌గా చూస్తున్నారు. దాదాపు 42 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నారు ఆయన. ఆయన 80ల్లో ఒకసారి ఆస్కార్‌ ప్రాంగణంలో అడుగుపెట్టారు. ఆయన వరకు అది చాలా గొప్ప అచీవ్‌మెంట్‌. ఎందుకంటే ఆస్కార్‌ ప్రాంగణంలో అడుగుపెట్టిన తొలి సౌత్‌ ఇండియన్‌ ఆయనే. అలాంటిది ఇవాళ మా పాట నామినేట్‌ అయింది. మాకు ఈ నామినేషన్‌ విలువ తెలియకపోవచ్చు. కానీ మా నాన్నకు తెలుసు. మేం మా కోసమే కాదు, భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరి కోసం మేం ప్రార్థిస్తున్నాం. నా వరకు, ఆస్కార్‌ అనేది ఒలింపిక్‌లో గోల్డ్ మెడల్‌ సాధించినదానితో సమానం.
 
పెరిగిన విధానం
నేను పెరుగుతున్నప్పుడు, మా నాన్న అవార్డులుగానీ, మా నాన్నకు సంబంధించిన వార్తలున్న మ్యాగజైన్లు కానీ, మా ఇంటికి తీసుకొచ్చేవారు కాదు. ఆయన వృత్తి ప్రభావం మా ఇంట్లో వాళ్ల మీద పడకూడదన్నది ఆయన అభిప్రాయం. సినిమా ఇండస్ట్రీ చాలా గ్లామరస్‌ ఇండస్ట్రీ అని అలా భావించేవారేమో. మమ్మల్ని మామూలు పిల్లలుగా పెంచడానికే ప్రయత్నించేవారు. మా నాన్న సూపర్‌స్టార్‌ అనే గర్వం మా తలకు ఎక్కకుండా చూసుకునేవారు. 

చిన్నతనంలో మా స్కూల్లో నాకు  మార్కులు తక్కువగా వస్తే, నా స్కూల్‌ని మార్చేసేవారు. రెండేళ్లకు పైగా ఒకే పాఠశాలలో నేనెప్పుడూ చదవలేదు. కొన్నిసార్లు నాకు వచ్చే గ్రేడ్‌ల కోసం కావచ్చు, మరికొన్నిసార్లు నాలో క్రమశిక్షణ పెంచడం కోసం కావచ్చు.. కారణం ఏదైనా స్కూళ్లు మార్చేసేవారు. నేను స్పోర్ట్స్ లో ఉండటం వల్ల మార్కులు తక్కువగా వచ్చేవి. చిన్నతనంలో మ్యాథ్స్, హిస్టరీ చాలా ఇష్టంగా చదివేవాడిని. అల్లరి పిల్లాడిని, ఆకతాయి కుర్రాడిని మాత్రం కాదు. చాలా మంచివాడిని.

మా నాన్నతో ఎక్కువ సమయం గడపడానికి వీలయ్యేది కాదు. ఆయనతో కలిసి భోజనం చేసేటప్పుడు మాత్రమే మాకు సమయం దొరికేది. ఆయన్ని మిగిలిన సమయాల్లో డిస్టర్బ్ చేయకూడదు అనే రూల్‌ ఉండేది మా ఇంట్లో. నా చిన్నతనమంతా ఉమ్మడి కుటుంబంలోనే గడిచింది. ఇంట్లో చాలా మంది స్టాఫ్‌ ఉండేవారు. ఇంట్లో ప్రతి ఒక్కరూ ఏదో ఒక పనిచేసేవారు. యుఎస్‌లో లాగా కాకుండా, ఇండియాలో ఉమ్మడి కుటుంబాలుంటాయి.

నేనేమైనా చెడ్డ సినిమా  చేస్తే, మా నాన్నగారి దగ్గరకు వెళ్లి, ఎందువల్ల తప్పు జరిగిందో, ఎక్కడ తప్పు జరిగిందో అడిగి తెలుసుకుంటా (నవ్వుతూ). నా జర్నీని మా నాన్నగారు ఎంజాయ్‌ చేస్తున్నారు. ఆయనకు ఇప్పుడు 67 ఏళ్లు. సెట్లో మూడు సినిమాలతో బిజీగా ఉన్నారు.

మా ఇంట్లో మేం ఎనిమిది మంది నటులం ఉన్నాం. మా మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉంటుంది. మా నాన్నగారి నుంచి మేం అందరం చాలా విషయాలు నేర్చుకున్నాం. మా ట్రిపుల్‌ ఆర్‌కి చాలా దేశాల్లో అద్భుతమైన అంగీకారం దక్కింది. నాకు విదేశీయుల అభిప్రాయాలను తెలుసుకోవాలని ఉంది. వాళ్లు మా సినిమాలను ఎలా చూస్తున్నారో అర్థం చేసుకోవాలని ఉంది. వాళ్లిచ్చే సందేశాన్ని ఇంటికి తీసుకెళ్లాలని ఉంది" అని అన్నారు. 



More Telugu News