నేను నోరు విప్పితే అందరి అకౌంట్స్ బయటపడతాయి: తమ్మారెడ్డి భరద్వాజ

  • ఆర్ఆర్ఆర్ ఆస్కార్ ప్రమోషన్స్ కి 80 కోట్లు పెట్టారన్న తమ్మారెడ్డి 
  • అకౌంట్స్ తమ్మారెడ్డికి తెలుసా? అన్న రాఘవేంద్రరావు
  • పొలిటికల్ కోణంలో నాగబాబు వ్యాఖ్యలు
  • ఇద్దరికీ బదులిచ్చిన తమ్మారెడ్డి
  • ఎవడు ఎవడి కాళ్లు పట్టుకున్నాడో తనకు తెలుసని వెల్లడి
ఆస్కార్ ప్రమోషన్స్ కోసం ఆర్ఆర్ఆర్ టీమ్ రూ.80 కోట్లు ఖర్చు చేసిందని, ఆ డబ్బు తమకిస్తే 8 సినిమాలు తీసి ముఖాన కొడతామంటూ తమ్మారెడ్డి భరద్వాజ వ్యాఖ్యానించగా... దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, మెగాబ్రదర్ నాగబాబు తీవ్రంగా ఖండించడం తెలిసిందే. 

ఆర్ఆర్ఆర్ టీమ్ వాళ్లు ఎంత ఖర్చు పెట్టారో తమ్మారెడ్డి వద్ద అకౌంట్స్ ఉన్నాయా? అంటూ రాఘవేంద్రరావు ప్రశ్నించగా, వైసీపీ వాళ్లకు వారి భాషలోనే సమాధానం చెప్పాలంటూ నాగబాబు పొలిటికల్ టచ్ ఇచ్చారు. 

ఈ నేపథ్యంలో, రాఘవేంద్రరావు, నాగబాబు వ్యాఖ్యలకు తమ్మారెడ్డి భరద్వాజ గట్టిగా కౌంటర్ ఇచ్చారు. తాను నోరు విప్పితే అందరి అకౌంట్స్ బయటపడతాయి అని హెచ్చరించారు. నేను మాట్లాడడం మొదలుపెడితే ఒక్కొక్కడి అకౌంట్ ఏంటో తెలుస్తుంది... విని తట్టుకోగలరా? అని సవాల్ విసిరారు. 

"ఇండస్ట్రీలో ఉన్న చాలామంది అకౌంట్లు నాకు తెలుసు. అవార్డుల కోసం ఎవడి కాలు ఎవడు పట్టుకున్నాడో తెలుసు. పదవుల కోసం ఎవడు ఎవడ్ని అడుక్కున్నాడో తెలుసు. ల్యాండ్ కోసం ప్రభుత్వాలకు లేఖలు రాసి ల్యాండ్స్ తీసుకున్న విషయం తెలుసు. ల్యాండ్స్ ఇవ్వకపోతే ఎలా విమర్శించిందీ తెలుసు" అని వ్యాఖ్యానించారు.

సాధారణంగా తాను ఏదైనా వ్యాఖ్యలు చేసినప్పుడు బయటి వాళ్లు స్పందిస్తుంటారని, ఈసారి చిత్ర పరిశ్రమకు చెందినవాళ్లే మాట్లాడుతుండడంతో తాను గట్టిగా సమాధానం చెప్పాల్సి వస్తోందని తమ్మారెడ్డి పేర్కొన్నారు. అయితే తాను చెప్పే జవాబు మనుషులకు కాదని, చిత్ర పరిశ్రమకు అని స్పష్టం చేశారు. 

ఆర్ఆర్ఆర్ పై తాను చేసిన వ్యాఖ్యల పట్ల కట్టుబడి ఉన్నానని, ఎలాంటి తప్పుడు మాటలు మాట్లాడలేదు కాబట్టి ఎవరికీ క్షమాపణ చెప్పాల్సిన అవసరంలేదని భావిస్తున్నానని అన్నారు. "ఆర్ఆర్ఆర్ ఎంతో గొప్ప చిత్రం అని చెప్పాను... అప్పుడెవడూ పట్టించుకోలేదు. ఓ చిన్న క్లిప్పింగ్ పై మాత్రం రాద్ధాంతం చేస్తున్నారు. రాజేశ్ టచ్రీవర్ సినిమాలపై సమీక్ష సందర్భంగా చేసిన వ్యాఖ్యలు అవి. మాటవరసగా చేసిన వ్యాఖ్యలు అవి. 

ఏ సందర్భంలో అన్నానో, ఎక్కడ అన్నానో చూసుకోకుండా... నీకు అకౌంట్స్ తెలుసా అని ఒకడు (రాఘవేంద్రరావు) అడుగుతాడు. ఇంకొకడు (నాగబాబు) నీ అమ్మ మొగుడు అంటాడు. నా అమ్మ మొగుడు నాకు సంస్కారం నేర్పించాడు... నీతినిజాయతీ నేర్పించాడు. అందుకే సహనం పాటిస్తున్నాను. నేను కూడా బూతులు మాట్లాడగలను. చిత్ర పరిశ్రమ నాకు తల్లి వంటిది. మీకు సిగ్గులేకపోతే నాకుంది. మిమ్మల్ని ఏమైనా అంటే చిత్రపరిశ్రమను విమర్శించినట్టవుతుంది... అందుకే మాట్లాడడంలేదు" అంటూ తమ్మారెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.


More Telugu News