ఢిల్లీ లిక్కర్ స్కాం: స్పెషల్ కోర్టులో కొనసాగుతున్న వాదనలు

  • ఢిల్లీ లిక్కర్ స్కాంలో సిసోడియా అరెస్ట్ 
  • కోర్టులో హాజరుపరిచిన ఈడీ అధికారులు
  • సిసోడియా తరఫున దయన్ కృష్ణన్, సిద్ధార్థ్ అగర్వాల్ వాదనలు
  • ఈడీ తరఫున జోహెబ్ హుస్సేన్ వాదనలు
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ అధికారులు మనీశ్ సిసోడియాను నిన్న అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, సిసోడియాను ఈడీ అధికారులు కోర్టులో హాజరు పరిచారు. ప్రస్తుతం స్పెషల్ కోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి సిసోడియా తరఫున న్యాయవాదులు దయన్ కృష్ణన్, సిద్ధార్థ్ అగర్వాల్ వాదనలు వినిపిస్తుండగా... ఈడీ తరఫున ప్రత్యేక న్యాయవాది జోహెబ్ హుస్సేన్ వాదనలు వినిపిస్తున్నారు. 

విజయ్ నాయర్, సిసోడియా, కవిత తదితరులు లిక్కర్ స్కాంకు కుట్ర పన్నారని ఈడీ తరఫు న్యాయవాది ఆరోపించారు. ఆప్ నేతలకు సౌత్ గ్రూప్ దాదాపు రూ.100 కోట్లు ఇచ్చిందని వెల్లడించారు. ఢిల్లీలో 30 శాతం మద్యం వ్యాపారాన్ని సౌత్ గ్రూప్ కు ఇచ్చారని వివరించారు. కవితను విజయ్ నాయర్ కలిశారని, లిక్కర్ పాలసీ ఎలా ఉందో చూపాలని విజయ్ ని కవిత అడిగారని ఈడీ న్యాయవాది తెలిపారు. 

సీఎం, డిప్యూటీ సీఎం తరఫున విజయ్ నాయర్ వ్యవహరించారని... పాలసీ విధానాలు, జీఓఎం నివేదికను మంత్రుల కన్నా రెండ్రోజుల ముందే కవితకు బుచ్చిబాబు ఇచ్చారని వెల్లడించారు. ఇండో స్పిరిట్స్ కంపెనీకి ఎల్1 లైసెన్స్ ఇప్పించడంలో సిసోడియా పాత్ర ఉందని ఈడీ తరఫు న్యాయవాది స్పష్టం చేశారు. 

లిక్కర్ పాలసీ తయారీలో కీలకపాత్ర మనీశ్ సిసోడియాదేనని అన్నారు. లిక్కర్ వ్యాపారం మొత్తం కొంతమందికే కట్టబెట్టారని, లిక్కర్ దందాలో సౌత్ గ్రూప్ పాత్ర ఉందని పేర్కొన్నారు. 12 శాతం మార్జిన్ తో హోల్ సేల్ విక్రయదారులకు లాభం చేకూరేలా పాలసీలో మార్పులు చేశారని న్యాయవాది జోహెబ్ హుస్సేన్ ఆరోపించారు. 

పాలసీ రూపొందించాక కొంతమంది ప్రైవేట్ వ్యక్తులకు పంపారని, కుట్రలో భాగంగానే ఈ విధానాన్ని అమలు చేశారని వివరించారు. మంత్రుల సంఘం తీసుకున్న నిర్ణయాలు ఎలా బయటికి వచ్చాయి? అని ప్రశ్నించారు. 

ఓవరాల్ గా సౌత్ గ్రూప్ కు అనుకూలంగానే మద్యం పాలసీలో మార్పులు చేశారని స్పష్టం చేశారు. కేవలం కంటితుడుపు చర్యగానే ప్రజల నుంచి సలహాలు, సూచనలు తీసుకున్నారని ఈడీ న్యాయవాది వ్యాఖ్యానించారు. 

కొన్ని ప్రైవేటు కంపెనీలకు భారీ ప్రయోజనం కల్పించేలా పాలసీలో మార్పులు చేశారని, మొత్తం కుట్రను సమన్వయం చేసింది విజయ్ నాయర్ అని వెల్లడించారు. ఈ స్కామ్ లో ప్రభుత్వ ఉద్యోగులు, మధ్యవర్తులు, రాజకీయ నాయకులకు సంబంధించి అనేక కోణాలు ఉన్నాయని తెలిపారు.


More Telugu News