అవినాశ్ రెడ్డి పిటిషన్‌లో ఇంప్లీడ్ అయ్యేందుకు వివేకా కుమార్తె యత్నం

  • సీబీఐ విచారణలో ఆడియో, వీడియో రికార్డు చేసేందుకు అవినాశ్ రెడ్డి పిటిషన్
  • పిటిషన్‌లో వివేకా కుమార్తె సునీత వ్యక్తిగత అంశాల ప్రస్తావన
  • ఆ పిటిషన్‌లో తనను ఇంప్లీడ్ చేయాలని కోర్టును కోరనున్న సునీత
వైఎస్ వివేకా కుమార్తె సునీత తెలంగాణ హైకోర్టుకు చేరుకున్నారు. వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. తన విచారణ సందర్భంగా ఆడియో, వీడియో రికార్డు చేసేలా ఆదేశాలు జారీ చేయాలంటూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో అవినాశ్ పిటిషన్‌లో తనను ఇంప్లీడ్ చేయాలని సునీత కోరనున్నారు. పిటిషన్‌లో అవినాశ్ రెడ్డి తన వ్యక్తిగత అంశాలు పేర్కొనడంపై తన వాదనలను వినాలని సునీత కోర్టును అభ్యర్ధించనున్నారు. 

కాగా.. వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి నేడు మరోమారు సీబీఐ విచారణకు హాజరయ్యారు. ఇప్పటికే రెండు మార్లు ఆయనను విచారించిన సీబీఐ నేడు మరోమారు పలు అంశాలపై ప్రశ్నించనుంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఎంపీ అవినాశ్ హైకోర్టును ఆశ్రయించారు. తన పిటిషన్‌లో ఆయన సీబీఐపై పలు ఆరోపణలు చేసినట్టు తెలిసింది.  వివేకా కుటుంబంలో చాలా వివాదాలు ఉన్నాయని, సొంత కుటుంబం నుంచే ఆయనకు ప్రమాదం ఉందని చెప్పారు. తన వాంగ్మూలం తాలూకు ఆడియో, వీడియోలను రికార్డు చేయాలని చెప్పినా సీబీఐ పట్టించుకోలేదని ఎంపీ తన పిటిషన్‌లో ఆరోపించారు. తన ఆడియో వీడియోలను రికార్డు చేయడంతో పాటూ స్టేట్‌మెంట్ కాపీని ఇచ్చేలా ఆదేశాలు జారీ చేయాలంటూ పిటిషన్ దాఖలు చేశారు.


More Telugu News