ఈ వీడియోని తన మనవడికి చూపించిన ఆనంద్ మహీంద్రా

  • భారత్ గురించి ప్రశంసాత్మకంగా మాట్లాడిన గయానా విదేశాంగ మంత్రి
  • 130 కోట్ల సంరక్షణ చూసుకుంటూ, ప్రపంచం కోసం పనిచేస్తానంటోందన్న హగ్
  • దీన్ని తన చిన్న మనవడికి గర్వంతో చూపించానన్న ఆనంద్ మహీంద్రా
ప్రముఖ పారిశ్రామికవేత్త, మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా ఏం చేసినా భిన్నంగా ఉంటుంది. మూసకట్టు విధానంలో ఉండదు. సామాజిక మాధ్యమం ట్విట్టర్ పై చురుగ్గా ఉండే ఆయన ఎంతో మందికి స్ఫూర్తినీయుడిగా ఉంటారు. తాజాగా ఆయన తన ట్విట్టర్ పేజీలో ఓ వీడియోని పోస్ట్ చేశారు.

‘‘ఇదేమీ కొత్త వీడియో కాదు. కానీ, ఇది నా ఇన్ బాక్స్ లోకి వచ్చి చేరింది. నా చిన్న మనవడికి ఈ వీడియోని గర్వంతో చూపించాను. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పిల్లలు భారత్ ఇలా ఉంటుందని అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. కేవలం ఆర్థిక శక్తిగానే కాకుండా, సానుకూల మార్పు కోసం అభివృద్ధి చెందుతున్న దేశం’’ అని ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు.

ఈ వీడియో గయానా విదేశాంగ మంత్రి హగ్ టాడ్ ప్రసంగానికి సంబంధించినది. భారత్ ను మల్టీ లేటరల్ ఇనిస్టిట్యూషన్ (బహుముఖ సంస్థ)గా టాడ్ అభివర్ణించారు. ‘‘భారత్ 130 కోట్ల ప్రజల సంక్షేమాన్ని చూసుకుంటోంది. 130 కోట్ల ప్రజల సంరక్షణ చూసుకుంటూ కూడా, విధాన స్థాయిలో మిగతా ప్రపంచం కోసం ఏమైనా చేయగలనేమో చూస్తానని అనడాన్ని మీరు ఊహించగలరా? మల్టీ లేటరల్ ఇనిస్టిట్యూషన్స్ ఆ పని చేయగలవు’’ అని టాడ్ పేర్కొన్నారు.



More Telugu News