ఢిల్లీలో కవిత దీక్షను ప్రారంభించిన సీతారాం ఏచూరి

  • పార్లమెంట్ లో మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టాలన్న డిమాండ్ తో కవిత దీక్ష
  • వేదికపై కూర్చొని సంఘీభావం ప్రకటించిన సీపీఎం అగ్రనేత ఏచూరి
  • దీక్షకు హాజరైన మంత్రులు సబిత, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యేలు
చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్‌లు అమలు చేయాలని, మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టాలన్న డిమాండ్ తో భారత జాగృతి అధ్యక్షురాలు, తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఢిల్లీలోని జంతర్‌మంతర్‌లో నిరసన దీక్ష ప్రారంభించారు. సాయంత్రం 4 గంటల వరకు దీక్ష కొనసాగనుంది. జాతీయ గీతాలాపన తర్వాత సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి.. కవితకు పూలమాల వేసి దీక్ష ప్రారంభింపజేశారు. వేదికపై కవిత పక్కన కూర్చొని దీక్షకు సంఘీభావం తెలిపారు. అంతకుముందు పార్టీ నేతలతో కలిసి వేదిక వద్దకు చేరిన ఎమ్మెల్సీ కవిత మహాత్మా గాంధీ, చాకలి ఐలమ్మ, రాణి రుద్రమదేవితో పాటు పలువురు  జాతీయ నేతల విగ్రహాలకు పూలమాలలు వేశారు.

దీక్షలో రాష్ట్ర మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్‌, ఎంపీలు కవిత, వద్దిరాజు రవీంద్ర, ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్‌ రెడ్డి, రేఖానాయక్‌, భారత జాగృతి మహిళా నేతలు కూర్చుకున్నారు. పలు రాష్ట్రాలకు చెందిన విపక్ష పార్టీల నేతలు దీక్ష వేదిక వద్దకు వచ్చి సంఘీభావం తెలుపుతున్నారు. కాగా, ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కవితకు ఈడీ నోటీసులు జారీ చేసింది. శనివారం ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో ఆమె విచారణకు హాజరుకానున్నారు. కవిత దీక్షకు దేశ వ్యాప్తంగా 18 ప్రతిపక్ష పార్టీలు మద్దతు ప్రకటించాయి.


More Telugu News