ప్లీజ్.. ఆస్కార్ వేదికపై మాట్లాడే అవకాశం ఇవ్వరూ: జెలెన్ స్కీ

  • మరోసారి అభ్యర్థించిన ఉక్రెయిన్ అధ్యక్షుడు
  • మన్నించని ఆస్కార్ అకాడమీ
  • గతేడాది కూడా ప్రయత్నించి విఫలమైన జెలెన్ స్కీ
ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్ స్కీ ఆస్కార్ అవార్డుల వేదికపై ప్రసంగించాలని కోరుకుంటున్నారు. ఇదే విషయాన్ని ఆస్కార్ అకాడమీకి తెలియజేసి, మాట్లాడేందుకు అవకాశం కల్పించాలని కోరారు. ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం మొదలైన తర్వాత ఎన్నో ప్రపంచ వేదికలపై జెలెన్ స్కీ ప్రసంగించారు. వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉక్రెయిన్ వాణిని వినిపించేందుకు వినియోగించుకున్నారు. తద్వారా ప్రపంచ ప్రజల దృష్టిలో రష్యాను దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది వీక్షించే ఆస్కార్ అకాడమీ అవార్డుల కార్యక్రమంలో తన ప్రసంగానికి చోటు కోసం ప్రయత్నిస్తున్నారు.

మార్చి 12న లాస్ ఏంజెలెస్ లోని డాల్బీ థియేటర్ లో 95వ ఆస్కార్ అకాడమీ అవార్డుల కార్యక్రమం జరగనుంది. 13వ తేదీన తెల్లవారుజామున అవార్డుల కార్యక్రమం ప్రసారం కానుంది. అకాడమీ అవకాశం ఇస్తే జెలెన్ స్కీ వీడియో కాన్ఫరెన్స్ రూపంలో వర్చువల్ గా మాట్లాడనున్నారు. కానీ, జెలెన్ స్కీ అభ్యర్థనను అకాడమీ మన్నించలేదు. తోసిపుచ్చింది.  గతేడాది కూడా ఆస్కార్ అకాడమీ అవార్డుల కార్యక్రమం వేదికగా మాట్లాడేందుకు జెలెన్ స్కీ ప్రయత్నించి విఫలం కావడం గమనార్హం.



More Telugu News