కొచ్చిలో లాక్ డౌన్ పరిస్థితులు.. ఎందుకంటే!

  • కొచ్చిలోని బ్రహ్మపురం డంప్ యార్డ్ లో అగ్ని ప్రమాదం
  • చెత్త, ప్లాస్టిక్ కాలిపోయి విషపూరిత పొగలతో జనం ఉక్కిరిబిక్కిరి
  • వారం రోజులుగా తలుపులు, కిటికీలు మూసి ఇళ్లకే పరిమితం అయిన జనాలు
కరోనా మహమ్మారి కారణంగా దేశం చాన్నాళ్లు లాక్ డౌన్ లోకి వెళ్లింది. ఇప్పుడు కరోనా వ్యాప్తి లేకపోయినా కేరళ రాష్ట్రం కొచ్చిలో లాక్ డౌన్ పరిస్థితులు నెలకొన్నాయి. కొచ్చి సమీపంలోని బ్రహ్మపురం పరిసరాల్లో జనాలంతా ఇళ్లకే పరిమితం అయ్యారు. తలుపులు, కిటికీలు మూసేశారు. బయటికి ఎవ్వరూ రావడం లేదు. ఓ భారీ డంప్ యార్డ్ లో జరిగిన అగ్ని ప్రమాదం ఇందుకు కారణమైంది. బ్రహ్మపురం డంప్‌యార్డులో గత వారం అగ్నిప్రమాదం జరిగింది. అగ్ని మాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలు ఆర్పేశారు. కానీ, 110 ఎకరాల్లో విస్తరించిన ఆ డంప్ యార్డ్ లో ఇంకా అక్కడక్కడా మంటలు కనిపిస్తున్నాయి. అగ్ని ప్రమాదం కారణంగా దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. చెత్త, అందులోని ప్లాస్టిక్ కాలి విషపూరిత పొగలు రావడంతో చుట్టూ కొన్నికిలో మీటర్ల పరిధిలోని జనాలు వాటిని పీల్చి ఉక్కిరిబిక్కిరయ్యారు. 

చాలా మంది తలుపులు, కిటికీలు మూసి ఇంట్లోనే ఉంటున్నారు. మరికొందరైతే ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టాలని యోచిస్తున్నారు. గుట్టలాంటి చెత్త కుప్ప కారణంగా బ్రహ్మపురం నివాసితులు ఇలాంటి ఘటనలను ప్రతీ సంవత్సరం చూస్తుంటారు. కానీ, ఈ సారి తీవ్రత ఎక్కువ కావడంతో జనం అల్లాడిపోతున్నారు. చెత్త వాసన పీల్చడమే కష్టం అవుతుండగా ఇప్పుడు అది కాలిపోయి ఘాటైన రసాయనాల వాసన పీల్చడంతో అనారోగ్యానికి గురవుతున్నారు. ‘మొదట్లో బాగానే ఉంది కానీ ఆదివారం నుంచి వాసన మరీ ఎక్కువైంది. బాల్కనీ, కిటికీలు తెరవలేక పోయాం. కరోనా వాపస్ వచ్చినట్టు అనిపిస్తోంది. రాత్రి అయితే వాసన మరీ ఎక్కువగా వస్తోంది’ అని అక్కడి మహిళ తమ ఇబ్బందిని తెలిపింది. ప్రస్తుతం ప్రభుత్వ అధికారులు బ్రహ్మపురంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు.


More Telugu News