ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు... నామినేషన్లు దాఖలు చేసిన వైసీపీ అభ్యర్థులు

  • ఏపీలో ఈ నెల 23న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు
  • ఏడుగురు వైసీపీ అభ్యర్థులకు బి-ఫారాలు అందజేసిన సీఎం జగన్
  • సీఎం జగన్ సామాజిక న్యాయం అమలు చేస్తున్నారన్న సజ్జల 
ఏపీలో మార్చి 23న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఏడు ఎమ్మెల్సీ స్థానాలకు ఇటీవల నోటిఫికేషన్ విడుదల కాగా, వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు నేడు నామినేషన్లు దాఖలు చేశారు. 

ఈ ఉదయం సీఎం జగన్ నుంచి బి-ఫారాలు అందుకున్న పెన్మత్స సూర్యనారాయణరాజు, మర్రి రాజశేఖర్, పోతుల సునీత, చంద్రగిరి ఏసురత్నం, జయమంగళ వెంకటరమణ, బొమ్మి ఇజ్రాయెల్, కోలా గురువులు.... అసెంబ్లీలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. 

ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. ఏడు స్థానాలకు గాను సీఎం జగన్ ఎంపిక చేసిన అభ్యర్థులు నామినేషన్లు వేశారని వెల్లడించారు. జగన్ సోషల్ ఇంజినీరింగ్ మొదలుపెట్టారని, ఎన్నికల ముందు హామీ ఇచ్చిన విధంగా సామాజిక న్యాయం అమలు చేస్తున్నారని కొనియాడారు. శాసనమండలి ఎన్నికలకు సంబంధించి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలను కలుపుకుని... మొత్తం 18 ఎమ్మెల్సీ స్థానాల్లో 11 స్థానాలు బీసీలకు కేటాయించినట్టు సజ్జల వెల్లడించారు. 

గత ప్రభుత్వం మాటలకే పరిమితం అయిందని, చంద్రబాబు పాలనలో బీసీలకు ఎందుకు అవకాశం ఇవ్వలేదని ప్రశ్నించారు. సీఎం జగన్ సామాజిక న్యాయాన్ని మాటల్లో కాదు... చేతల్లో చూపిస్తున్నారని పేర్కొన్నారు.


More Telugu News