గవర్నర్లకు నోరు ఉంది కానీ.. చెవులు లేవనిపిస్తోంది.. స్టాలిన్ ఎద్దేవా

  • తమిళనాడులో చాలా రోజులుగా డీఎంకే సర్కారు వర్సెస్ గవర్నర్ వివాదం
  • ఇటీవల యాంటీ గ్యాంబ్లింగ్ బిల్లును ఆమోదించకుండా వెనక్కి పంపిన గవర్నర్
  • గవర్నర్లు మాట్లాడేది ఎక్కువ, వినేది తక్కువని స్టాలిన్ విమర్శ 
తమిళనాడులో డీఎంకే సర్కారు వర్సెస్ గవర్నర్ వివాదం కొనసాగుతోంది. కొద్ది కాలంగా రెండు వైపులా మాటల యుద్దం నడుస్తోంది. తాజాగా గవర్నర్ వ్యవస్థపై ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ విమర్శలు చేశారు. గవర్నర్లు ఎక్కువగా మాట్లాడుతున్నారని, కానీ తక్కువ వింటున్నారని ఎద్దేవా చేశారు. 

‘ఉంగలిల్ ఒరువన్’ పేరుతో రాసిన తన ఆత్మకథ ఆవిష్కరణ కార్యక్రమంలో స్టాలిన్ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాల్లో గవర్నర్లు జోక్యం చేసుకోరాదన్న సుప్రీంకోర్టు ఆదేశాలను గవర్నర్లు పాటిస్తారా? అని రిపోర్టర్లు స్టాలిన్ ను ప్రశ్నించారు. బదులిచ్చిన ఆయన.. ‘‘ఇప్పటివరకు గవర్నర్ల చర్యలను గమనిస్తే.. వారికి నోరు ఉంది కానీ.. చెవులు లేవని అనిపిస్తోంది’’ అని సెటైర్ వేశారు. ప్రభుత్వం ఆమోదించి పంపిన యాంటీ గ్యాంబ్లింగ్ బిల్లును గవర్నర్ వెనక్కి పంపడాన్ని ఉద్దేశిస్తూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు. 

సిసోడియా అరెస్టుపైనా స్టాలిన్ స్పందించారు. ‘‘ప్రతిపక్ష పార్టీలను బీజేపీ బహిరంగంగా ఎలా బెదిరిస్తుందో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. రాజకీయ కారణాలతో వారు దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారు. మనీశ్ అరెస్టును ఖండిస్తున్నాం’’ అని చెప్పారు.


More Telugu News