'డెడ్ లైన్' ఇంటర్వ్యూ... రాజమౌళితో మళ్లీ సినిమా చేయడంతో పాటు పలు అంశాలను పంచుకున్న రామ్ చరణ్

  • సినిమాల్లోకి వస్తానని చిన్నప్పుడు అనుకోలేదన్న రామ్ చరణ్
  • రాజమౌళి ఫోన్ చేస్తే కాదనలేమని వ్యాఖ్య
  • ఆయనపై ప్రేమ, గౌరవంతోనే ఆర్ఆర్ఆర్ ను ఒప్పుకున్నానని వెల్లడి
ఆస్కార్ అవార్డు కోసం అమెరికాకు వెళ్లిన రామ్ చరణ్ కు అక్కడి మీడియా నీరాజనం పలుకుతోంది. తాజాగా హాలీవుడ్ మీడియా సంస్థ అయిన 'డెడ్ లైన్' ఆయనను ఇంటర్వ్యూ చేసింది. ఈ ఇంటర్వ్యూలో రామ్ చరణ్ పలు విషయాలను పంచుకున్నారు. చరణ్ ఏం వెల్లడించాడో ఆయన మాటల్లో... 

"'ఆర్ఆర్ఆర్' సరిహద్దులను చెరిపివేసిన చిత్రం. ఇండియాలో వివిధ భాషలకు వివిధ సినీ పరిశ్రమలు ఉన్నాయి. అయితే ఒక ఇండస్ట్రీ గొప్పదని, మరొకటి తక్కువని మేము ఎప్పుడూ భావించము. ఎందుకంటే ఎవరి బిజినెస్ వాళ్లది, ఎవరి ఫ్యాన్స్ వారిది. 'ఆర్ఆర్ఆర్' సినిమా విజయంతో ఎంతో సాధించిన ఫీలింగ్ కలుగుతోంది. నేను నటుడిని అవుతానని చిన్నప్పుడు అనుకోలేదు. ఇంట్లో మేము సినిమాల గురించి మాట్లాడుకునే వాళ్లం కాదు. స్కూల్, కాలేజీ రోజుల్లో బాగా చదువుకోవాలని మాత్రమే నాన్న చెప్పేవారు. ఇంట్లో సినిమాలకు అతీతమైన వాతావరణమే ఉండేది. నాన్న సినిమాలకు సంబంధించిన ఫొటోలు కూడా ఇంట్లో ఉండేవి కాదు. 

2009లో మగధీర సినిమాకు రాజమౌళితో కలిసి పని చేశా. రాజమౌళితో నాది ఒక గొప్ప అనుభవం. ఆయన ఇండియన్ జేమ్స్ కేమెరూన్, స్టీవెన్ స్పిల్ బర్గ్. మనం దేని గురించి కలలు కంటామో అదే రాజమౌళి. రాజమౌళి ఫోన్ చేస్తే కాదనలేము. సినిమాలో లీనమైపోతాము. షూటింగ్ ఎన్ని రోజులు ఉంటుందనే విషయాన్ని కూడా ఆయనను అడగలేము. ఇలాంటి ఏకైక దర్శకుడు బహుశా రాజమౌళి మాత్రమే. 

మనసు విషయానికి వస్తే రాజమౌళిది ఒక చిన్న పిల్లాడి మనస్తత్వం. దర్శకుడిగా ఎంతో ఎత్తులో ఉన్నా ఎప్పుడూ అందుబాటులో ఉండే వ్యక్తి. ఆయనలో నాకు నచ్చే గుణం ఏమిటంటే... నటులకు పూర్తి స్వేచ్ఛను ఇస్తారు. ఆయన ఆలోచించడమే కాకుండా... నీ మైండ్ లో ఇంకా ఏమైనా ఉందా? అని అడుగుతారు. తద్వారా సినీ ప్రయాణంలో నటులు పూర్తిగా భాగస్వాములు అయ్యేలా చేస్తారు. కేవలం రాజమౌళి మీద ఉన్న ప్రేమ, గౌరవం కారణంగానే 'ఆర్ఆర్ఆర్' సినిమాను ఒప్పుకున్నా" అని రామ్ చరణ్ చెప్పారు.


More Telugu News